సినిమా రంగం అంటేనే వెలుగు నీడల సంగమం. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో.. ఎప్పుడు ఎవరిని పాతాళానికి తొక్కేస్తుందో ఎవరికీ తెలీదు. కొన్ని స్వకృతాపరాధాలు అయితే మరికొన్ని విధి వక్రించడంవల్ల ఏర్పడే అనర్థాలు. పైకి నవ్వుతూ, తుళ్ళుతూ కనిపించే ఎంతో మంది తారల జీవితాల్లో బయటికి చెప్పుకోలేని విషాదాలు ఉంటాయి. అయితే కొందరు వాటిని బహిర్గతం చేస్తారు. మరికొందరు వాటిని తమలోనే దాచుకొని కుమిలిపోతుంటారు. అన్నింటికంటే పెద్ద సమస్య చెప్పుకోదగ్గది ఆరోగ్య సమస్య. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఖరీదైన వ్యాధి వచ్చిందంటే ఖచ్చితంగా వారికి డబ్బు సాయం అవసరం అవుతుంది.
అటువంటి పరిస్థితిలోనే సాయం అర్థిస్తోంది ఓ నటి. ఐస్‌క్రీమ్2, ఫిదా, మిఠాయి, కొబ్బరిమట్ట, అమర్ అక్బర్ ఆంటోని వంటి పలు చిత్రాల్లో సహాయనటిగా కనిపించింది. ముఖ్యంగా ‘ఫిదా’ చిత్రంలో సాయిపల్లవి ఫ్రెండ్‌గా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం గాయత్రి గుప్తా ఆర్థిక సాయం అర్థిస్తూ దీనావస్థలో ఉంది. చాలాకాలంగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతోంది గాయత్రి. ఈ విషయాన్ని కొంతకాలం క్రితం తెలియజేసింది. డిప్రెషన్ వల్ల ఈ వ్యాధి వస్తుందట. దీనికి సరైన చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని, అయితే ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు తన దగ్గర డబ్బు లేదని చెప్పింది. ప్రస్తుతం గాయత్రి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆమె చికిత్స నిమిత్తం రూ.12 లక్షలు ఖర్చవుతుంది. ఈమేరకు ఎవరైనా దాతలు సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తోంది.
ఇంపాక్ట్ గురు అనే స్వచ్ఛంద సంస్థ విరాళాలను సేకరించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటివరకు రూ.1.5 లక్షలు మాత్రమే విరాళాలు అందాయి. ఇంకా చాలా మొత్తం అవసరమవుతుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ కొంత సాయాన్ని అందించి ఆమెకు ధైర్యం చెప్పాడట. ఈ పరిస్థితిలో వున్న గాయత్రికి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం అందుతుందో చూడాలి.