posted on Aug 7, 2024 9:30AM
వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్యాక్టీరియా వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు, జ్వరం రావడం సాధారణం. అయితే జలుబు జ్వరం వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ మాత్రలపైన, మందులపైన ఆధారపడటం ద్వారా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్ వంటి జబ్బులకు వంట ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
శరీరంలో రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గినా ఆరోగ్యం దెబ్బతిని జ్వరం, జలుబు, దగ్గు అన్నీ ఒక్కొక్కటిగా వేధించడం మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ చూద్దాం…
తేనె-అల్లం రసం:
ఒక టేబుల్ స్పూన్ అల్లం రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు సమస్య క్రమంగా తగ్గుతుంది.
పసుపు నీరు:
జ్వరం, దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యలు ఉంటే ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో కొద్దిగా పసుపు కలిపి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది.
తులసి టీ:
తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు దగ్గు, కఫం, జలుబు, జ్వరంతో పోరాడుతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు తులసి టీ తాగడం అలవాటు చేసుకోండి.
తులసి రసం:
రెండు టీస్పూన్ల గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కలపడం అలవాటు చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి జ్వరం కూడా అదుపులోకి వస్తుంది.
ధనియాల టీ:
ధనియాల గింజల్లో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి, ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర గింజల టీ తయారు చేసి తాగడం మంచిది.
మెంతులు నానబెట్టిన నీరు:
ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను అరకప్పు నీటిలో నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జ్వరం సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.