ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంగానే మిగిలిపోయేలా ఉంది. పరిస్థితి చూస్తూంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అయిదేళ్ల పాటు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా అంతా వైసీపీ నుంచే కనిపించారు. ఎటు చూసినా ఫ్యాన్ గిర్రున తిరుగుతూ కనిపించింది. ఇదంతా బలమే అనుకుని మురిసిపోయే లోపుగా అసలు నిజం తెలిసింది. అధికారం వెలుగులో కనిపించింది అంతా వాపు మాత్రమే అని అర్ధమయ్యేసరికి ఫ్యాన్ డెడ్ స్లో అయిపోయింది.
ఎన్నికలలో ఓటమి అన్నది అత్యంత సహజం. 2014లోనూ వైసీపీ ఓటమిపాలు అయింది. అయితే ఆనాడు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా తగ్గిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేశారు. క్షేత్రస్ధాయిలో బలంగా కనిపించారు. అయితే ఇపుడు దానికి పూర్తిగా భిన్నమైన నేపధ్యం ఉంది. ఉత్తరాంధ్రలో 2014లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిస్తే ఈసారి ఆ సంఖ్య దారుణంగా రెండుకు పడిపోయింది. అది కూడా విశాఖ ఏజెన్సీలో పాడేరు, అరకు సీట్లు గెలిచి వైసీపీ పరువు నిలిచింది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం రెండు సీట్లు గెలిచిన వైసీపీకి మిగిలిన 32 అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ భారీ ఓటమి ఎదురైంది. పార్టీ ఓడిపోయింది కానీ చాలా చోట్ల చూస్తే నియోజకవర్గాలలో ఇన్చార్జిలు లేని భారీ లోటు కనిపిస్తోంది.
వైసీపీ అధినాయకత్వం చేసిన సోషల్ ఇంజనీరింగ్‌తో పాటు సీట్ల మార్పు వల్ల అనేక నియోజకవర్గాలలో ఎన్నికలలో పోటీ చేసినవారు అంతా ఓటమి కాగానే తట్టా బుట్టా సర్దుకుని తమ సొంత ప్రాంతాలకు వెళ్లపోయారు. దాంతో ఎవరు అక్కడ పార్టీ బాధ్యులు అంటే జవాబు దొరకని పరిస్థితి.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికే వస్తే ఇచ్చాపురంలో వైసీపీ నుంచి పోటీ చేసిన పిరియా విజయ ఓటమి తరువాత తగ్గిపోయారు. అక్కడ ఎమ్మెల్సీ నర్తు రామారావు మాత్రమే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో ఆయన టిక్కెట్ కోసం ఆశించి ఉన్నారు. దాంతో ఆయన కొంత పార్టీని కలుపుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా ఇన్చార్జి పదవి మీద కన్నేశారు. ఇక్కడ ఇన్చార్జి ఎవరో వైసీపీ అధినాయకత్వం నిర్ణయించాల్సి ఉంది.
పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓటమి చెందారు. ఆమె మీద ముందు నుంచి వ్యతిరేకత ఉంది. దాంతో పాతపట్నంలో వైసీపీ ఇన్చార్జిని కొత్తవారిని పెట్టాలని కోరుతున్నారు. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఉన్నా ఆయన చురుకుగా లేరన్న మాట ఉంది. ఇక్కడ కూడా పార్టీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అన్న సూచనలు ఉన్నాయి.
టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తప్ప మరో నేత లేరా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎపుడూ కింజరాపు కుటుంబం మీద ఓటమి తప్ప సాధించింది లేదు అన్నది వైసీపీ కార్యకర్తల మాట. దాంతో టెక్కలిలో ఇన్చార్జిని వెతికి పెట్టాల్సిందే.
శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. కానీ ఓటమి తరువాత ఆయన పెద్దగా హడావుడి చేయడంలేదు. ఇక్కడ కూడా పార్టీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న మాట ఉంది. అలాగే ఎచ్చెర్లలో ముందు నుంచి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మీద అసంతృప్తి ఉంది. అదే బీజేపీని తాజా ఎన్నికలలో గెలిపించింది. ఇపుడు ఎచ్చెర్లలో కూడా బలమైన నేత అవసరం వైసీపీకి ఉంది.
పాలకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి స్ధానంలో మార్పు అవసరం ఉంది. అలాగే రాజాంలో కూడా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులుని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ ఇపుడు గట్టి నేత ఇక్కడ వైసీపీకి కావాల్సి ఉంది. నరసన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కేడర్ మార్పు కోరుతోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు వస్తే విజయనగరంలో మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామికి బదులుగా తూర్పు కాపు సామాజికవర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందని చర్చ సాగుతోంది. బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వృద్ధుడు అయిన కారణంగా తప్పించి యువ నేతకు ఛాన్స్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది.
కురుపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్ధానంలో ఎవరైనా కొత్త వారు ఉంటే వైసీపీ పరిచయం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్ల వ్యతిరేకత ఉంది. ఇక్కడ కూడా బలమైన నాయకత్వం అవసరం ఉంది. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ నేత పీడిక రాజన్నదొరకు విశ్రాంతి ఇచ్చి యువతరానికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఎస్ కోటలో కడుబండి శ్రీనివాసరావు స్ధానికేతరుడు అన్న అసంతృప్తి కేడర్‌లో ఉంది. దాంతో నియోజకవర్గానికి కొత్త నాధుడిని వారు కోరుకుంటున్నారు.
గజపతినగరంలో బొత్స అప్పలనరసయ్యను పక్కన పెట్టాలని, నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు స్ధానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చీపురుపల్లిలో సైతం బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తేనే ఉత్తమం అని అంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే అనకాపల్లి నుంచి ఎన్నారై భరత్‌కుమార్‌ను పోటీ చేయించి విఫల ప్రయోగం చేశారు. దీంతో అనకాపల్లి వైసీపీకి ఉనికి లేకుండా పోయింది. అక్కడ బలమైన నాయకత్వం అవసరం అన్న మాట ఉంది.
పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు రాజ్యసభ ఇచ్చారు. రాజాం నుంచి కంబాల జోగులును తెచ్చి పోటీ చేయించారు. ఓటమి తరువాత జోగులు కనిపించడంలేదు. దీంతో ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వడమే మేలు అంటున్నారు. విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలలో పార్టీకి ఇన్‌చార్జిలే లేకుండా పోయారు. పోటీ చేసిన అభ్యర్ధులు ఇపుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇదే విధంగా పెందుర్తి, విశాఖ ఉత్తర నియోజకవర్గాలతో పాటు భీమిలీలోనూ పార్టీ ప్రక్షాళన జరగాల్సి ఉందని అంటున్నారు. అలాగే శ్రీకాకుళం విజయనగరం,అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంట్ స్ధానాలకు బలమైన ఇన్చార్జిలను నియమించడం ద్వారానే ఫ్యాన్ స్పీడ్‌ను పెంచవచ్చునని కార్యకర్తల నుంచి వస్తున్న విలువైన సూచనగా ఉంది.
The post వైసీపీకి ఇన్చార్జిలు కావలెను appeared first on Great Andhra.