యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు2’ చిత్రం 2017లో ప్రారంభమైంది. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ జరిగినపుడే అది వర్కవుట్ అయ్యే ప్రాజెక్ట్ కాదని అందరికీ అర్థమైంది. దానికితోడు షూటింగ్‌కి అన్నీ ఆటంకాలు ఏర్పడడంతో సినిమాను పూర్తి చేసేందుకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేశారు. మొదటి షో నుంచే సినిమాపై బ్యాడ్ టాక్ వచ్చేసింది. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సబ్జెక్ట్‌తో సీక్వెల్ చేస్తే మారిన ట్రెండ్ ప్రకారం ఆదరణ ఉండదని అందరూ భావించినట్టుగానే జనం కూడా ఈ సినిమాని తిప్పికొట్టారు. శంకర్ కెరీర్‌లోనే ‘భారతీయుడు2’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాను రూ.250 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో రిలీజ్ చేశారు. కానీ, ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల మార్క్‌ని కూడా చేరుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. రిలీజ్‌కి ముందే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ యాజమాన్యం ఆలోచనలో మార్పు వచ్చింది. థియేటర్లలో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు2’ చిత్రానికి ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ ఉంటుందని భావించింది. అందుకే ముందు మాట్లాడుకున్న విధంగా రూ.120 కోట్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ సంస్థల మధ్య డిజిటల్ రైట్స్ విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇది ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది.
ఇంతకుముందు అఖిల్ సినిమా ‘ఏజెంట్’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. సినిమా డిజాస్టర్ కావడంతో లెక్కల్లో మార్పులు వచ్చాయి. దాంతో అమెజాన్ ఆ డీల్‌ను క్యాన్సిల్ చేసుకుందట. ఇప్పటికీ ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ కాకపోవడానికి అదే రీజన్ అని తెలుస్తోంది. ఒక సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలంటే ఖచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ చెయ్యాలనే నిబంధన ఉంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అనుకున్న డీల్‌ని క్యాన్సిల్ చేసుకునే విధంగా లేదా ముందుగా ఇచ్చిన ఆఫర్‌ను తగ్గించే విధంగానే అగ్రిమెంట్ చేసుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. మరి ‘భారతీయుడు 2’ విషయంలో నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఎలాంటి ఒప్పందం చేసుకోబోతున్నారో చూడాలి.