విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న షాయాజీ షిండే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో మహారాష్ట్ర సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ కారణంగా ఆయనకు యాంజియోప్టాస్టీ చేశారు. ప్రస్తుతం షాయాజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు.
గత కొంతకాలంగా షాయాజీ ఆరోగ్యం బాగోకపోవడంతో రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. ఈసీజీలో స్వల్పంగా మార్పులు గమనించిన వైద్యులు యాంజియోగ్రఫీ చేయించమని సూచించారు. గుండెలోని కుడివైపు భాగంలో 99 శాతం బ్లాక్స్ ఉన్నాయని, వాటి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని యాంజీయోప్లాస్టీ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.