ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌లో ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యిందంటే అది రన్‌తో కాకుండా వచ్చిన కలెక్షన్స్‌తోనే లెక్కిస్తున్నారు. ఒకప్పుడు అర్థ శతదినోత్సవం నుంచి గోల్డెన్ జూబ్లీ వరకు సినిమాలు రన్ అయ్యేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక సినిమా శతదినోత్సవం చేసుకోవడం అంటే అదొక వండర్‌లా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలను అత్యధిక థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసెయ్యడం ద్వారా రెండు, మూడు వారాల్లోనే సినిమాకి పెట్టిన పెట్టుబడిని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన బిజినెస్ ట్రెండ్ ఇది.
జూన్ 27న విడుదలైన ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2898ఎడి’ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 40 రోజులు దాటినప్పటికీ థియేటర్స్‌లో రన్ అవుతోంది. మొదటి రెండు వారాల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసిన ‘కల్కి’ ఇంకా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో రూ.650 కోట్లు షేర్‌గా వచ్చింది. గత ఏడాది షారూక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ విడుదలైన అన్ని సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టి రూ.1000 కోట్ల మార్క్‌ని దాటేసింది. అందులో రూ.700 కోట్లు షేర్ సాధించింది.
ఇప్పటిరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాలుగా బాహుబలి 2, కేజీఎఫ్2, ఆర్‌ఆర్‌ఆర్, జవాన్ ఉన్నాయి. ప్రస్తుతం ‘కల్కి’ కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్ టార్గెట్ షారూక్ అని అర్థమవుతుంది. మరో రూ.50 లక్షలకు పైన కలెక్ట్ చేస్తే షారూక్‌ని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి వెళతాడు. ఆగస్ట్ 15 వరకు భారీ చిత్రాలేవీ రిలీజ్‌కి లేవు కాబట్టి ‘కల్కి’ తన టార్గెట్‌ను రీచ్ అయ్యే అవకాశం ఉంది.