మన శరీరంలో సగం జబ్బులకు కారణం మనం తినే ఆహారమే. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ దీన్ని నియంత్రించేది మాత్రం చాలా తక్కువ మంది. ఇప్పుడిది ఎంత ప్రమాదకర స్థితికి చేరిందంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 54శాతం మంది రోగుల ఆరోగ్య సమస్యలకు కారణం అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడమే.
స్వయంగా ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో స్థూలకాయం పెరిగిపోతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలోని యువతలో ఇది తీవ్రమైన సమస్యగా మారిందని స్పష్టం చేసింది.
ఇకనైనా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు భారత యువతను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. ఈ సందర్భంగా మరికొన్ని కీలక మార్పుల్ని గమనించింది.
గడిచిన దశాబ్ద కాలంగా భారతీయుల జీవన శైలిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇంట్లో వండిన ఆహారం కంటే, రెడీమేడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వైపు భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఊబకాయంతో పాటు, షుగర్-బీపీ లాంటి సమస్యలు రావడానికి ఇదే ప్రధాన కారణమని సర్వేలో తేలింది.
పెరిగిన జనాభాతో దేశం లబ్ది పొందాలన్నా, ఆరోగ్య భారత్ ను ఆవిష్కరించాలన్నా.. యువత ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని సర్వే అభిప్రాయపడింది.
వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, ప్రపంచదేశాల్లో వియత్నాంలో స్థూలకాయం ఎక్కువగా ఉంది, రెండో స్థానంలో నమీబియా, మూడో స్థానంలో భారత్ నిలిచాయి. ఇక దేశంలో లెక్కలు చూసుకుంటే.. దేశరాజధాని ఢిల్లీలో 41.3 శాతం మంది మహిళలు స్థూలకాయం బారిన పడుతున్నారు.
The post సగం జబ్బులకు కారణం ఇదే appeared first on Great Andhra.