దిశ, ఫీచర్స్ : సమ్మర్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భగ భగ మండే ఎండలు. వివిధ పనుల మీద బయటకు వెళ్లేవారు వేడిగాలులు, ఉక్కబోతలతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికీ వెళ్లకపోయినా వాతావరణ మార్పులతో పలువురు అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇక ఎండకు గురయ్యే వారిలో డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ రిస్క్
గతంకటే ఈ సంవత్సరం ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తు్న్నారు. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేడ్‌గా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఇక తల తిరగడం, తీవ్రమైన అలసట, వాంతులు విరేచనాలు వంటి సింప్టమ్స్ కనిపిస్తే అవి డీహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.
చర్మ సంరక్షణ కోసం ..
ఎండాకాలంలో పలువురిలో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అప్పటికే ఏదైనా చర్మ వ్యాధితో బాధపడేవారిలో ఈ ప్రాబ్లం మరింత అధికంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురద, కాలిపోయినట్లు మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో చర్మాన్ని రక్షించుకోవాలంటే బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్ వంటివి అప్లయ్ చేయడం, ఎండ ప్రభావం నేరుగా పడకుండా గొడుగు వాడటం, కాటన్ దుస్తులు ధరించడం వంటివి చేయడం మంచింది.
సమతుల్య ఆహారం
సమ్మర్ ఎఫెక్ట్ వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే ఆహారాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఈ సీజన్‌లో చాలా మంది పొట్టలో ఉబ్బరం, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణ ధాన్యాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
కూల్ వాటర్ తాగే ముందు..
వేసవిలో జలుబు, ఫీవర్, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా పలువురిని వేధిస్తుంటాయి. ఎండలో నుంచి ఇంటికి రాగానే వెంటనే ఫ్రిడ్జ్‌లోని చల్లటి నీళ్లు గాబరాగా తాగడంవల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తే చాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ కూల్ వాటర్ కాకుండా, నార్మల్ కూలింగ్ వాటర్ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొబ్బరి నీళ్లు, ఐస్ కలపని ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోవడం మంచిది.