ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా తెలంగాణలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మొదటిసారి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో భట్టి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఆయన ప్రతిపాదించారు.
ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతుల్ని పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వ్యవసాయం స్థిరీకరణ జరగాలని తాము కోరుకున్నామన్నారు. తమ ప్రభుత్వం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఎగ్గొడతామని చెబుతోందని ఆయన విమర్శించారు. ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు. స్టోరీ టెల్లింగ్‌లా వుందే తప్ప, బడ్జెట్ అనే భావన కలిగించలేదని కేసీఆర్ విమర్శించారు.
ఒక్క పథకంపై కూడా స్పష్టత లేదన్నారు. ఉదాహరణకు గొర్రెల పథకాన్ని ఎత్తి వేశారన్నారు. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక పాలసీలేవీ లేవన్నారు. అలాగే ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని కేసీఆర్ విమర్శించారు.
గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని ఆకాంక్షించి అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క పథకం మీద కూడా స్పష్టత లేదని ఆయన అన్నారు. దళిత బంధు పథకం ప్రస్తావన కూడా లేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దళిత సమాజం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, భూస్వామ్య విధానానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదని ఆయన అన్నారు.
ఈ బడ్జెట్‌లో హైలెట్ ఏంటంటే డబ్బు కేటాయింపు సందర్భంలో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి చెప్పారని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. రేవంత్‌రెడ్డిది అర్బక ప్రభుత్వంగా కేసీఆర్ అభివర్ణించారు. ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామన్నారు. అందుకే తాను కూడా అసెంబ్లీకి రాలేదన్నారు.
The post సర్కార్‌ను చీల్చి చెండాడుతాం appeared first on Great Andhra.