భారాస- భాజపా వ్యతిరేక ఓటు మొత్తం ఏమాత్రం చీలకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ నానా పాట్లు పడుతోంది. అందరితోనూ సర్దుబాట్లు చేసుకుంటోంది. వామపక్షాలతో పొత్తులు కూడా ప్రస్తుతానికి ప్రతిష్ఠంభనగా ఉన్నప్పటికీ.. ఇవాళ ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అసలు బరిలోకి దిగనే దిగకుండా ఆపడంలో రేవంత్ రెడ్డి మంత్రాంగమే తెరవెనుక పనిచేసిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
కోదండరాం వంటి మేధావులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులను కాంగ్రెస్ కీలక నాయకులు స్వయంగా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. భేటీ తరువాత ఎన్నికలలో కోదండరాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి ఎన్నికలకు దూరంగా ఉంటుందని కూడా వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీని ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకుంటామని ప్రకటించారు. నిజానికి ఉద్యమాలు, పోరాటాలు తప్ప ప్రజలలో ఓట్లు సంపాదించి ఎమ్మెల్యేగా నెగ్గడానికి అవసరమైన నైపుణ్యాలు తక్కువగా ఉండే కోదండరాం లాంటివారికి ఈ ఒప్పందమే మేలు చేస్తుంది. వామపక్ష పార్టీల లాగా తమ పార్టీకి కూడా పొత్తుల్లో కొన్ని సీట్లు కేటాయించాలని భీష్మించుకొని పట్టు పట్టడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి చెప్పినది నిజమే అయితే ఆ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే గనుక ఆ అధికారంలో భాగమై, వారితో తెలంగాణ జన సమితి లక్ష్యాలను కూడా పంచుకోవచ్చు.
అయితే ఇలాంటి కీలకమైన నాయకులతో కేవలం అవగాహనకు రావడం ఒప్పందాలు చేసుకోవడం మాత్రమే కాంగ్రెస్ విజయానికి సరిపోతుందని అనుకుంటే భ్రమ. కోదండరామ్ లాంటి నాయకులు ఒక నియోజకవర్గంలో నిలబడి మెజారిటీ ప్రజల మనసులు గెలుచుకుని ఒంటరిగా విజయం సాధించలేకపోవచ్చు గాని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో కొంత మంది పరిమిత శాతంలో ఓటర్లను తప్పకుండా ప్రభావితం చేయగలరు. అందుకే కోదండరామ్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో కీలకంగా వినియోగిస్తేనే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది.
అలాగే నేడో రేపో వామపక్ష నాయకులతో సీట్ల అవగాహన కుదిరినట్లయితే, ఆ పార్టీ వారిని కూడా కేవలం వారి సొంత సీట్లు చూసుకోవడంతో ఆగిపోనివ్వకుండా రాష్ట్రవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ వాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగాను, ఇతర పార్టీలతోనూ సమైక్యంగా వ్యవహరిస్తూ పోరాడినప్పుడు మాత్రమే విజయం దక్కే అవకాశం ఉంటుంది.