ఓవైపు స్కంద రిలీజైంది. మరోవైపు చంద్రముఖి-2 వచ్చింది. పెదకాపు-1 కూడా రెడీ. థియేటర్లలో ఇంత సందడి నడుస్తుంటే, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈరోజు సెప్టెంబర్ 28 కాబట్టి.
ఈ రోజు కోసం కొన్ని నెలలుగా ఎదురుచూశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఏకంగా 150 రోజుల ముందు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ ఫుల్ గా 50 రోజుల వరకు తీసుకొచ్చారు కూడా. అంతలోనే సలార్ నుంచి బాంబ్ లాంటి వార్త. సినిమా రావట్లేదు అని.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటివరకు పెట్టిన కౌంట్ డౌన్స్ అన్నీ మూలనపడ్డాయి. లైకులు, షేర్లు కొట్టిన చేతులకు ఒక్కసారిగా నీరసం ఆవహించేసింది. అయినా ఏదో మూల చిన్న ఆశ. అది పుకారుగానే మిగిలిపోవాలనే కోరిక. కానీ అలా జరగలేదు.
ఎప్పుడైతే సినిమా వాయిదా వేశామంటూ హోంబలే నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిందో, ఆ క్షణమే కాడి పక్కనపడేశారు ప్రభాస్ ఫ్యాన్స్. కొత్త తేదీ వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. కానీ ఉన్నట్టుండి సడెన్ గా ఈరోజు సలార్ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎందుకంటే, ఈరోజు సెప్టెంబర్ 28 కాబట్టి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి సలార్ సినిమాను చూస్తూ ఉండేవాళ్లు ప్రభాస్ ఫ్యాన్స్. థియేటర్లలో ఈలలు వేస్తూ, పేపర్లు విసురుతూ, హారతి పడుతూ తెగ సందడి చేసి ఉండేవాళ్లు. కానీ ఆ అవకాశం ఇంకా అందలేదు. అదే బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కొత్త విడుదల తేదీ చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. సలార్ డిసెంబర్ 22 రిలీజ్ అంటూ ఇప్పటికే ఫీలర్లు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు.