కొద్దిరోజులుగా ‘సలార్’ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగంగా ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. మొదట ఈ నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత వచ్చే సంక్రాంతి లేదా వేసవి అంటూ ఇలా రకరకాల డేట్స్ వినిపించాయి. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ డిసెంబర్ 22న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సలార్ విడుదల తేదీని హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కావడం ఖాయమని, ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ సమాచారం వచ్చిందని, సెప్టెంబర్ 29న అధికారిక ప్రకటన రానుందని హిందీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో క్రిస్మస్ హాలిడేతో లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో మంచి డేట్ సెలెక్ట్ చేసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అదే డిసెంబర్ 22 తేదీపై షారుఖ్ ఖాన్ ‘డుంకీ’తో ఎప్పుడో కర్చీఫ్ వేసి ఉన్నాడు. పైగా ఈ ఏడాది వరుసగా ‘పఠాన్’, ‘జవాన్’తో రెండు సార్లు రూ.1000 కోట్ల మార్క్ ని టచ్ చేశాడు. షారుఖ్ క్రేజ్, ప్రస్తుతం ఆయనున్న ఫామ్ ని బట్టి చూస్తే.. నార్త్ ఇండియా, ఓవర్సీస్ తో పాటు సౌత్ మేజర్ సిటీలలోనూ సలార్ ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశముంది. ఇదంతా ఆలోచించకుండా ఆ డేట్ ని లాక్ చేయడం అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విషయంలో షారుఖ్ కి పెద్ద నెగటివ్ సెంటిమెంట్ ఉంది.
ఐదేళ్ల క్రితం 2018 డిసెంబర్ 21న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ‘కేజీఎఫ్-1’తో పాటు, షారుఖ్ ‘జీరో’ సినిమాలు విడుదలయ్యాయి. ఏ అంచనాల్లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ సంచలన విజయం సాధించగా, ‘జీరో’ మాత్రం టైటిల్ కి తగ్గట్టుగానే ఘోర పరాజయంపాలైంది. ఇప్పుడు ఐదేళ్లకు ప్రశాంత్ నీల్-హోంబలే ఫిలిమ్స్ కాంబోలో వస్తున్న ‘సలార్’తో షారుఖ్ ‘డుంకీ’ తలపడనుంది. మరి ‘సలార్’ మాస్ ముందు, ‘డుంకీ’ క్లాస్ నిలబడుతుందా? లేక అప్పటి జీరో రిజల్ట్ రిపీట్ అవుతుందో చూడాలి.