పిఠాపురం నుంచి పవన్.. 91 పైనే గట్టి నమ్మకం!
అదిగో అక్కడ్నుంచి.. ఇదిగో ఇక్కడ్నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారంటూ గత రెండు నెలలుగా లెక్కలేనన్ని కథనాలే వచ్చాయి. భీమవరం అని ఒకసారి.. గాజువాక నుంచే అని మరోసారి.. అబ్బే ఆ రెండూ కాదు.. అస్సలే ఎమ్మెల్యేగా కానే కాదని ఇంకోసారి.. ఎంపీగా పోటీచేస్తున్నారని ఇలా ఒకటా రెండా ఎన్ని వార్తలు వచ్చాయో.! సీన్ కట్ చేస్తే.. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీచేస్తున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించేసి.. ఇన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే పిఠాపురం నుంచే పవన్ ఎందుకు పోటీ చేస్తున్నారనే దానిపై కాస్త నిశితంగా పరిశీలిస్తే పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా పిఠాపురం వేదికగా ఏం చేసినా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తూ వస్తున్నారు.
ఇదిగో ఇదీ అసలు కథ..!
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ పోటీ చేయగా.. రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. ఎక్కడ తేడా జరిగింది.. ఏం జరిగిందనేది ఇప్పుడిక్కడ అప్రస్తుతం. ఈసారి కూడా ఓడిన చోట నుంచే గెలవాలని.. అప్పుడే ఆ కిక్కు వేరుగా ఉంటుందని.. అయితే గాజువాక లేకుంటే భీమవరం నుంచి పోటీచేస్తారని మొదట ప్రచారం జరిగింది.. దాదాపు ఇదే విషయాన్ని పార్టీ కీలక నేతలు అంగీకరించారు కూడా. అయితే.. పవన్ సడన్‌గా తన వ్యూహాన్ని మార్చేసి.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే.. ఇక్కడ్నుంచి పోటీచేస్తే కచ్చితంగా పవన్ భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేల్లో తేలడంతో ఇక్కడ్నుంచే పోటీచేయడాని పవన్ మొగ్గు చూపారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 91 వేలు ఉన్నాయి. ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని.. పవన్ భారీ విజయానికి ఎలాంటి ఢోకా ఉండదని.. స్థానికంగా ఉన్న కాపు నేతలు చెబుతున్నారు. పైగా.. కాకినాడ రూరల్ జనసేన ఖాతాలోకే వచ్చింది. ఇక్కడ్నుంచి పంతం నానాజీ పోటీచేస్తుండటం.. ఇక కాకినాడ ఎంపీ సీటు కూడా జనసేనకే ఖరారు కావడంతో.. పవన్ పిఠాపురం నుంచి పోటీచేస్తే ఆ ప్రభావంతో అన్నీ జనసేన ఖాతాలోనే పడతాయని పార్టీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారట.
ఇంత నమ్మకమా..?
గత కొన్నిరోజులుగా పార్టీ వ్యవహారాలు అయితేనేం.. వారాహి యాత్ర ఇంకా ఎలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టినా కాకినాడ జిల్లా నుంచే ప్రారంభిస్తూ వస్తున్నారు. దీంతో నాటి నుంచే దాదాపు పిఠాపురం పవన్‌దేనని ప్రచారం గట్టిగానే జరిగింది. ఈ మధ్యనే పార్టీ ఆఫీసుకు ఏర్పాట్లు చేస్తుండటం.. ఇప్పటికే హెలిప్యాడ్‌ను లీజుకు తీసుకోవడంతో ఇక పక్కా అని తేలిపోయింది కానీ.. పొత్తులు, కూటమితో చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చనేది ఇన్‌సైడ్ టాక్. మరోవైపు రేపో.. మాపో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ చేరిక తర్వాత పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపాలని వైసీపీ యోచిస్తోంది. ఇప్పుడిక పవన్ పోటీచేస్తారని ప్రకటన రావడంతో వైసీపీ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తోంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇక్కడ్నుంచి వైసీపీ ఎంపీ వంగా గీత.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ, అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఇప్పుడిక ఈ సీటును ముద్రగడకు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూస్తే.. పిఠాపురంలోని కాపులపైనే గట్టి నమ్మకం పెట్టుకున్న పవన్‌కు ఏ మాత్రం కలిసొస్తుంది..? ఈసారి ఏపీ పొలిటికల్ సీన్ ఎలా ఉంటుందో..? పవన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.