దిశ, ఫీచర్స్ : కొందరు చదువులో, పనిలో మంచి సామర్థ్యం ప్రదర్శిస్తుంటారు. సబ్జెక్టుపై అవగాహన, విషయాల మీద పట్టు కూడా ఉంటాయి. కానీ నలుగురికి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం తడబడుతుంటారు. అంటే కమ్యూనికేట్ చేయడంలో ఇక్కడ విఫలం అవుతుంటారు. మరి కొందరు తమకు తెలిసిన వ్యక్తుల ముందు, ఫ్రెండ్స్‌తో హుషారుగా మాట్లాడుతుంటారు. కానీ బయటకు వెళ్లినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు కానీ అస్సలు మాట్లాడలేరు. పైగా భయపడుతుంటారు. నిజం చెప్పాలంటే అవసరమైన సందర్భంలో ప్రతిస్పందించడానికి ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే సాధారణం కావచ్చు. కానీ ఎల్లప్పుడూ ఈ విధమైన ప్రవర్తన మానసిక రుగ్మతకు నిదర్శనమని మానసిక నిపుణులు చెప్తున్నారు. సైకాలజీ పరిభాషలో దీనినే సెలెక్టివ్ మ్యూటిజం అని కూడా పిలుస్తారు.
కమ్యూనికేట్ చేయలేకపోతారు
అవసరం లేనప్పుడు మాటల్లో, చేతల్లో గొప్ప సమర్థులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కూడా ఒకానొక సందర్భంలో తమలోని టాలెంట్‌ని ప్రదర్శించలేని బలహీనత ఏర్పడుంది. ఈ ‘సెలెక్టివ్ మ్యూటిజం’ డిజార్డర్ బారిన పడినవారు తమ చుట్టూ ఉండే వ్యక్తులు లేదా సమజానికి మధ్య అకారణంగానే ఒక అవరోధాన్ని క్రియేట్ చేసుకుంటారు. కొందరిలో తాము పుట్టి పెరిగిన కుటుంబ, సామాజిక వాతావరణంవల్ల కూడా ఈ బలహీనత ఏర్పడవచ్చు. మనసులో బాగా నాటుకుపోయిన ప్రతికూల భావాలు, సంఘటనల కారణంగా సదరు వ్యక్తులు అవసరమైన సందర్భాల్లో కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంటారు. ఇక తప్పని సరి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిస్పందిస్తుంటారు. కానీ చాలా తక్కువ.
సోషల్ యాంగ్జైటీస్ కూడా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 32 శాతం మంది పిల్లలు, 24 శాత మంది పెద్దలు తమలో గొప్ప సామర్థ్యం, మాట్లాడగల నైపుణ్యం ఉన్నప్పటికీ వాటిని బయటకు ప్రదర్శించలేక, అన్నీ తెలిసినా ఏమీ తెలియని వారిలాగే ఉండిపోతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఇంటర్నల్ అండ్ సోషల్ యాంగ్జైటీస్ కూడా కారణం అవుతున్నాయి. తమ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, కొలీగ్స్‌తో బాగానే కమ్యూనికేట్ చేయగలుగుతున్నప్పటికీ పలువురు ‘సెలెక్టివ్ మ్యూటిజం డిజార్డర్’వల్ల సోషల్ ఇంటరాక్షన్స్, మీటింగ్స్, తమకు అంతగా పరిచయం లేని పలు కార్యక్రమాల్లో తెలిసిన విషయాలను కూడా మాట్లాడలేకపోతుంటారు. పైగా తీవ్రమైన సోషల్ యాంగ్జైటీ లేదా ఫోబియాను అనుభవిస్తారు.
సందర్భాన్ని బట్టి మాట్లాడలేక..
సామర్థ్యం ఉన్నప్పటికీ సందర్భోచితంగా ప్రదర్శించలేని ‘సెలెక్టివ్ మ్యూటిజం డిజార్డర్’ బాధితులు కమ్యూనికేషన్ ప్రారంభించడంలో ఇబ్బంది పడుతుంటారు. వీరు పిల్లలు అయితే గనుక పాఠశాల సమావేశాల్లో, క్లాస్ రూముల్లో మాట్లాడలేక భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సందర్భంగా తల వంచడం లేదా సైగల ద్వారా వ్యక్తీకరించడానికి ట్రై చేస్తుంటారు. మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ వేరే మార్గాల ద్వారా.. ఉదాహరణకు సంజ్ఞలు, పెయింటింగ్, మెసేజెస్ వంటి ప్రత్యామ్నాయాల్లోనే ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తుంటారు. కొందరిలో ఫ్రస్టేషన్, ఐసోలేషన్, నిస్సహాయత వంటివి కనిపిస్తుంటాయి. ఏదైనా మాట్లాడే సందర్భంలో ఆందోళన, వణుకు, కళ్లు ఎర్రబడటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ఆందోళనకు అదే కారణమా?
సామర్థ్యం ఉన్నా ప్రదర్శించలేని బలహీనత, నలుగురిలో మాట్లాడలేని భయానికి దారితీసే ‘సెలెక్టివ్ మ్యూటిజం డిజార్డర్’ ఎందుకు ఏర్పడుతుందో తెలియజేసే సైంటిఫిక్ సైంటిఫిక్ స్టడీస్ అయితే లేవు గానీ సైకాలజిస్టులు కొన్ని కారణాలను గుర్తించారు. ముఖ్యంగా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. జర్నలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా స్పెసిఫిక్ ఫోబియాస్ వంటివి కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. తరచూ ఎక్కువగా ఆందోళన చెందే మనస్తత్వం కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడటాన్ని కష్టతరం చేస్తుంది. అలాగే సోషల్ ఫోబియా, నలుగురిలో మాట్లాడకపోవడం వంటి ‘మ్యూటిజం డిజార్డర్’ ఉన్న వ్యక్తుల వారసులకు కూడా ఆ బలహీనత రావచ్చు. దీనివల్ల బాధితులు సహజంగానే మరింత జాగ్రత్తగా ఉండటం, సిగ్గుపడటం, కొత్త లేదా తెలియని పరిస్థితుల్లో భయపడటం చేస్తుంటారు.
సమస్యకు పరిష్కారం ఇదే..
నలుగురిలో మాట్లాడలేని బలహీనత, ప్రదర్శించలేని సామర్థ్యానికి గలభయాలను పోగొట్టడం ద్వారా రుగ్మతను పారదోలవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కాగ్నెటివ్ – బిహేవియరల్ థెరపీ ద్వారా నలుగురిలో కమ్యూనికేట్ చేయలేని ఆందోళనను, నెగెటివ్ థాట్స్‌ను, ప్రవర్తను గుర్తించి పోగొట్టవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఆందోళనను రేకెత్తించే పరిస్థితులకు క్రమంగా నియంత్రించడం కూడా పనిచేస్తుంది. థెరపిస్ట్‌లు బాధిత వ్యక్తులతో మాట్లాడుతూ..వారిలోని భయాన్ని, బలహీనతను పోగొట్టేలా కౌన్సెలింగ్ ఇస్తారు. దీంతోపాటు బాధితులను సోషల్ ఇంటరాక్షన్స్‌లో భాగస్వామ్యం చేయడం, నలుగురిలో మాట్లాడాలని వారిని ప్రోత్సహించడం, మెచ్చుకోవడం చేయడం ద్వారా క్రమంగా మార్పు వస్తుంది.