హైకోర్టు ఆదేశాలు
సింగరేణి యాజమాన్యానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పుడే చేపట్టలేమని, మరింత గడువు కావాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. అక్టోబర్ లోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు దగ్గర పడడంతో ఎన్నికలు నిర్వహించలేమని సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ముందు సింగరేణి యాజమాన్యం తరఫున ఏఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండగలు కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. కార్మికుల తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. 2019లోనే గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసిందని కోర్టుకు తెలిపారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదొక కారణంతో ఎన్నికలు వాయిదా వేస్తోందని వాదించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, పండగలు అంటూ మళ్లీ వాయిదా వేయడానికి సాకులు చెబుతున్నారని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు… సింగరేణి సంస్థ పిటిషన్ ను కొట్టి్వేసింది.