Entertainment

సిద్ధార్థ్ ‘చిన్నా’ మూవీ రివ్యూ.. తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా


సినిమా పేరు: చిన్నా

తారాగణం: సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్, సబియా తస్నీమ్

సంగీతం: దిబు నైసన్ థామస్

నేపథ్య సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: సురేష్ ఏ ప్రసాద్

డీఓపీ: బాలాజీ సుబ్రహ్మణ్యం

రచన, దర్శకత్వం: ఎస్.యు. అరుణ్ కుమార్

నిర్మాత: సిద్ధార్థ్

బ్యానర్: ఏతకి ఎంటర్‌టైన్‌మెంట్

విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023

ఇంతకన్నా మంచి సినిమా తాను చేయలేనని ‘చిన్నా’ మూవీ ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ తెలిపాడు. అతను నటించిన తమిళ సినిమా ‘చిత్తా’ సెప్టెంబర్ 28న అక్కడ విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘చిన్నా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిజంగానే సిద్ధార్థ్ చెప్పిన స్థాయిలో ఉందా? చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ కి విజయాన్ని అందించేలా ఉందా?…

కథ:

ఈశ్వర్ అలియాస్ చిన్నా(సిద్ధార్థ్) మున్సిపల్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తన అన్నయ్య చనిపోవడంతో.. వదిన, అన్నయ్య కూతురు చిట్టి(సహస్ర శ్రీ) బాధ్యత తనే చూసుకుంటూ ఉంటాడు. జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో చిట్టి ఫ్రెండ్ మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. ఆ లైంగిక దాడి చేసింది చిన్నా అనే ఆరోపణలు వస్తాయి. ఈ షాక్ లో ఉండగానే చిట్టి మిస్ అవుతుంది. ఈ వరుస ఘటనల తర్వాత చిన్నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? మున్ని మీద లైంగిక దాడికి పాల్పడింది చిన్నానేనా? చిట్టి ఎలా మిస్ అయింది? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

చిన్నారులపై లైంగిక దాడుల గురించి మనం తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. అలాగే ఈ కథాంశంతో పలు సినిమాలు కూడా వచ్చాయి. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ కూడా ఈ తరహా కథతో రూపొందినదే. చిన్నా చిత్రాన్ని కూడా చిన్నారులపై లైంగిక దాడుల నేపథ్యంలోనే రూపొందించారు. అయితే ఇందులో చిన్నారుల సంరక్షణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో బలంగా చూపించారు. పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలని, సెల్ ఫోన్ లకి దూరంగా ఉంచాలని, ఎప్పుడూ పిల్లలని ఓ కంట కనిపెడుతూ ఉండాలని వివరంగా చూపించారు. సొంత వాళ్ళయినా మగవారి విషయంలో చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

దర్శకుడు కథని నడిపించిన తీరు బాగుంది. మున్ని మీద లైంగిక దాడి జరగడం, చిన్నాపై లైంగిక ఆరోపణలు, చిట్టి కనిపించకుండా పోవడం.. ఇలా కథలో ఎంతో సంఘర్షణ ఉంది. సున్నితమైన అంశాన్ని తీసుకొని దానిని ఎమోషనల్ గా నడిపించడమే కాకుండా.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగించేలా సినిమాని ఎంతో ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమాకి కథాకథనాలు ప్రధాన బలంగా నిలిచాయి. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను పక్కన పెడితే.. ఓవరాల్ గా సినిమా బాగుంది.

విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. సన్నివేశాలకు ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అయ్యేలా చేసింది. బాలాజీ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ, సురేష్ ఏ ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఈశ్వర్ అలియాస్ చిన్నా పాత్రలో సిద్ధార్థ్ చక్కగా ఒదిగిపోయాడు. భావోద్వేగాలు అద్భుతంగా పలికించాడు. చిట్టిగా సహస్ర శ్రీ. మున్నీగా సబియా ఆకట్టుకున్నారు. చిన్నా ప్రేయసిగా నిమిషా సజయన్, చిన్నా వదినగా అంజలి నాయర్ చక్కగా రాణించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:

మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమా ఆలోచన రేకెత్తించేలా, హృదయాన్ని బరువు ఎక్కించేలా ఉంది. చిన్నారుల తల్లిదండ్రులు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి.

 



Source link

Related posts

'గేమ్ ఛేంజర్'లో ఇన్ని పాటలా.. ఏ కాలంలో ఉన్నారు..?

Oknews

సెన్సార్‌ నిర్ణయంతో యూత్‌కి నిరాశ తప్పదా?

Oknews

ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!

Oknews

Leave a Comment