సినిమా పేరు: సిద్ధార్థ్ రాయ్
తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన తదితరులు
సంగీతం: రధన్
డీఓపీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: వి యశస్వీ
నిర్మాత: జయ అడపాక
సహ నిర్మాతలు: ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్స్: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024
‘అర్జున్ రెడ్డి’ సినిమా ఛాయలతో ఇటీవల ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ముఖ్యంగా యువత ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి చూపించారు. పైగా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఈ మూవీతో హీరోగా మారడం విశేషం. మరి ప్రచార చిత్రాలతో బోల్డ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సిద్ధార్థ్ రాయ్(దీపక్ సరోజ్) ధనవంతుల కుటుంబంలో పుట్టిన తెలివైన యువకుడు.. ఏకసంతాగ్రహి. అయితే అతనికి లాజిక్సే తప్ప ఎమోషన్స్ అంటే ఏంటో తెలీదు. తిండి, నిద్ర, సెక్స్ అనేవి కేవలం అవసరాలు మాత్రమే అని, వాటికంటూ ఎటువంటి ప్రత్యేకత లేదని భావిస్తాడు. అలాగే అతనికి మనుషులతో ఎమోషనల్ కనెక్షన్ అనేదే ఉండదు. కన్న తల్లిని దూషించినా రియాక్ట్ అవ్వడు. అలాంటి సిద్ధార్థ్ రాయ్ లో ఎమోషన్స్ ని తట్టి లేపుతుంది ఇందు(తన్వి నేగి). ఇందుతో సిద్ధార్థ్ పీకల్లోతు ప్రేమలో పడతాడు. ఆమె లేకుండా బ్రతకలేను అనే స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచి ఎటువంటి ఎమోషన్స్ లేకుండా రోబోలా పెరగడానికి కారణమేంటి? అటువంటి సిద్ధార్థ్, ఇందు ప్రేమలో ఎలా పడ్డాడు? ప్రాణంగా ప్రేమించిన ఇందు ఎందుకు అతన్ని కాదనుకొని వెళ్ళిపోయింది? సిద్ధార్థ్, ఇందుల ప్రేమ కథ విజయతీరాలకు చేరుకుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
అర్జున్ రెడ్డి ఫీవర్ నుంచి చాలామంది మేకర్స్ ఇంకా బయటకు రావడంలేదు. సిద్ధార్థ్ రాయ్ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎక్కువమందికి కలిగిన అభిప్రాయం ఇదే. అయితే ‘సిద్ధార్థ్ రాయ్’ అనేది కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి యొక్క జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా. కానీ నిజ జీవిత కథ అయినప్పటికీ.. ఇది ‘రోబో’ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో చిట్టి అనబడే రోబో.. ఎంతో నాలెడ్జ్ కలిగి, మనుషుల కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఎమోషన్స్ తోడవుతాయో.. అప్పుడు విధ్వంసం మొదలవుతుంది. ‘సిద్ధార్థ్ రాయ్’ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది.
సిద్ధార్థ్ కి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఇంటిలిజెంట్. కానీ లాజిక్స్ అంటూ ఎటువంటి ఎమోషన్స్ లేకుండా రోబోలా బ్రతుకుతాడు. అలాంటి సిద్ధార్థ్ కి ఇందు అనే అమ్మాయి ద్వారా ఎమోషన్స్ పరిచయమై.. ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడతాడు. అలాగే అప్పటిదాకా ఎమోషన్స్ తెలియని వ్యక్తి.. ఒక్కసారి ఎమోషన్స్ పరిచయం అయ్యాక.. వాటిని కంట్రోల్ చేసుకోలేక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతాడు. దీని వల్ల అతని ప్రేమ, జీవితం నాశనమవుతాయి. నిజానికి ఇది మంచి పాయింటే. కానీ దానిని మెప్పించేలా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు.
ఇందు కోసం సిద్ధార్థ్ పిచ్చోడిలా తిరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. అసలు సిద్ధార్థ్ కి ఏమైంది? అతన్ని ఇందు ఎందుకు వదిలేసింది? అని తెలుసుకోవాలనే ఆసక్తి మొదట్లో మనకి కలుగుతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేసే క్రమంలో డైరెక్టర్ తడబడ్డాడు. చాలా సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. చైల్డ్ హుడ్ సన్నివేశాలు అంతసేపు అవసరంలేదు అనిపిస్తుంది. ఎప్పుడైనా డైలాగ్ ద్వారా చెప్పడం కంటే, విజువల్ గా చూపించింది ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ డైలాగ్ ద్వారా చెప్పాల్సి వస్తే.. షార్ట్ అండ్ షార్ప్ గా ఉండేలా రాసుకోవాలి. కానీ ఇందులో కొన్ని చోట్ల స్పీచ్ లు ఉంటాయి. అవి వింటుంటే.. సినిమాకి కాకుండా, ఏదో మోటివేషనల్ క్లాస్ కి వచ్చామనే ఫీలింగ్ కలిగక మానదు.
హీరో క్యారెక్టరైజేషన్ కారణంగా ఫస్టాఫ్ కొంతవరకు పరవాలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా మెప్పించాయి. అయితే సెకండాఫ్ చాలావరకు ట్రాక్ తప్పింది. హీరోలో ఎమోషన్స్ మొదలై, హీరోయిన్ తో ప్రేమలో పడ్డాక.. చాలా సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. లవ్ అంటే సెక్సే అనేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. సినిమా ముగింపు మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. తీసుకొచ్చి తీసుకొచ్చి సినిమాని సడెన్ గా ఎండ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతికంగా ‘సిద్ధార్థ్ రాయ్’ మెప్పిస్తుంది. దర్శకుడు వి యశస్వీలో విషయం ఉంది. అతని థింకింగ్, మేకింగ్ బాగున్నాయి. కానీ కథనం, సన్నివేశాల రూపకల్పన మీద మరింత దృష్టి పెట్టాలి. రధన్ సంగీతం ఆకట్టుకుంది. పాటలు హమ్ చేసుకునేలా లేకపోయినా.. సినిమా చూస్తున్నప్పుడు బాగానే అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. శ్యామ్ కె. నాయుడు కెమెరా పనితనం మెప్పించింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి మాత్రం కత్తెరకు ఇంకా పని చెప్పి ఉండాల్సింది. దాదాపు 10-15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. అలా చేసినట్లయితే అక్కడక్కడా ల్యాగ్ అనే ఫీలింగ్ కలగకుండా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
రెండు వేరియేషన్స్ ఉన్న సిద్ధార్థ్ రాయ్ పాత్రలో దీపక్ సరోజ్ బాగా రాణించాడు. ఫీలింగ్స్ లేని రోబో లాంటి వ్యక్తిగా, అలాగే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కలిగిన వ్యక్తిగా.. వైవిధ్యాన్ని చక్కగా చూపించాడు. సిద్ధార్థ్ రాయ్ ప్రేయసిగా తన్వి నేగి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
హీరో క్యారెక్టరైజేషన్ ప్రధానంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా అంతగా మెప్పించలేదు. పాయింట్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ గాడి తప్పింది. ఇందులో హీరోకే కాదు.. సినిమాలో కూడా ఎమోషన్స్ మిస్ అయ్యాయి. బోల్డ్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ.. ఎమోషన్స్ మీద పెట్టినట్లయితే మెరుగైన అవుట్ పుట్ వచ్చి ఉండేది. యూత్ మాత్రం కొంతవరకు ఈ సినిమాలో సంతృప్తి చెందే అవకాశముంది.
రేటింగ్: 2/5
– గంగసాని