రెండు హెలికాప్టర్లు లీజుకు
సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లీజు ప్రాతిపదికన గ్లోబర్ వెక్ట్రా సంస్థ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లను విజయవాడ, విశాఖలో ఉంచాలని నిర్ణయించారు. 2 ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లు లీజుకు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్లు లీజు చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో కొత్త వాటిని సమకూర్చుకోవాలని నిర్ణయించారు. మరోవైపు సీఎం జగన్‌కు సంఘవిద్రోహుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీ నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున, ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో కొత్త హెలికాఫ్టర్లను సమకూర్చుకుంటున్నారు. కొత్తగా సమకూర్చుకునే హెలికాఫ్టర్లను ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ 2010 నుంచి వినియోగంలో ఉన్నందున దానిని మార్చాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదించింది.