నిన్న ఓ కార్యక్రమంలో గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇవాళ ట్వీట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ‘గద్దర్ అవార్డ్స్’ లను తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆయన రిక్వెక్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ గతంలో రేవంత్ సమక్షంలో గద్దర్ అవార్డులపై ఆయన మాట్లాడిన వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు.
డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన.. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. దీంతో ఇవాళ మెగాస్టార్ రెస్పాడ్ అయ్యారు. చిరంజీవి ట్వీట్‌ను సపోర్టు చేస్తూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా రేవంత్‌రెడ్డికి సపోర్ట్‌గా ట్వీట్ చేశారు.
కాగా రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గతంలో నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు కామెంట్స్ చేసారు. బహుశా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ ఏడాది గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.