సినీ పరిశ్రమలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా (RK Roja).. రాజకీయాల్లోనూ బాగానే రాణించారు. రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురై.. రాజకీయ జీవితం ప్రశ్నార్థకం కావడంతో.. రోజా మనసు మళ్ళీ సినిమాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికలలో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. వైసీపీతో పాటు.. రోజా కూడా ఎమ్మెల్యేగా ఘోర ఓటమిని చూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఇక రోజా.. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట.
అయితే నటిగా తెలుగునాట రోజాకి మునుపటి ఆదరణ ఉండే అవకాశం లేదు. అవకాశాలు కూడా క్యూ కట్టే అవకాశం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆమె.. మెగా, నందమూరి కుటుంబాలతో పాటు ఎందరో సినిమా వారిని టార్గెట్ చేస్తూ దారుణ విమర్శలు చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. సామాన్యుల్లోనూ ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. ఆమె తమిళ పరిశ్రమకు వెళ్లాలని చూస్తున్నారట. కోలీవుడ్ లోనూ ఆమెకి మంచి గుర్తింపు ఉంది. మరి రీ ఎంట్రీ రోజాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.