సినిమా తారలకు అభిమానులు ఉంటారు, వీరాభిమానులు ఉంటారు.. కొంతమంది అంతకుమించి ఉంటారు. అభిమానం హద్దులు దాటినపుడు వారి చర్యలు కూడా హద్దు మీరే ఉంటాయి. ఈ పోకడ ఎక్కువగా కోలీవుడ్‌లోనే కనిపిస్తుంది. వాళ్ళు ఏది చేసినా అతిగానే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సినిమా వాళ్ళను విపరీతంగా అభిమానించడం, ఆరాధించడం అనేది తమిళియన్స్‌లోనే ఎక్కువ. తమ అభిమాన నటుడు లేదా నటిపై వారికి ఆరాధన ఎక్కువైపోయినపుడు వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు. అలా తమ అభిమాన నటుడికి, నటికి గుడి కట్టించిన సందర్భాలు కోలీవుడ్‌లో చాలా ఉన్నాయి.
తాజాగా తమిళనాడులోని మధురైలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే అతనికి విపరీతమైన అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి కంటే ఎక్కువగా తన అభిమాన హీరోని ఆరాధిస్తాడు. కార్తీక్ అనే రజనీకాంత్ అభిమాని తను ఎంతో ఇష్టపడే హీరోకి గుడి కట్టి పూజలు నిర్వహిస్తున్నాడు. ఆ గుడిలో రజనీకాంత్ విగ్రహంతోపాటు తన తల్లిదండ్రుల ఫోటోలు, వినాయకుడి ఫోటోను ఉంచాడు. ప్రతిరోజు పూజలు, అభిషేకాలు, హారతులు.. ఇలా అన్నీ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.