రాజకీయాల్లో ఉన్న వారికి సెంటిమెంట్లు ఎక్కువ. తూర్పు నుంచి పని మొదలెట్టాలని అనుకుంటారు. అదే విధంగా తమకు గతంలో కలసి వచ్చిన చోట నుంచి కూడా రంగంలోకి దిగితే విజయం తధ్యమని భావిస్తారు. వైసీపీకి తూర్పు తీరం బాగా కలసి వచ్చింది. జగన్ ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర మొదలెట్టి ఇచ్చాపురం లో ముగించారు.
ఇపుడు అదే ఇచ్చాపురం నుంచి వైసీపీ ప్రతిష్టాత్మకమైన సామాజిక సాధికారిత బస్సు యాత్రను చేపడుతోంది. ఇచ్చాపురం ఒడిషా ఆంధ్రా బోర్డర్ లో ఉన్న నియోజకవర్గం. ఇక్కడ గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గెలవడంలేదు. ఈసారి గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది.
అందుకే వైసీపీ బస్సు ఏపీకి కడు చివరన ఉన్న ఇచ్చాపురం దాకా వెళ్ళింది. ఈసారి తమ ఇచ్చను తీర్చే చోటుగా ఈ ప్రాంతాన్ని భావిస్తోంది. అదే విధంగా జగన్ పాదయాత్ర పూర్తి చేసిన ప్రాంతంగా 151 సీట్లు ఇచ్చి వైసీపీకి అద్భుతమైన మెజారిటీని ఇచ్చిన నేలగా భావిస్తోంది.
వైసీపీ సామాజిక శంఖారావం రాజకీయంగా చైతన్యవంతం అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలెట్టి ఉత్తరాంధ్రా మీద గట్టి పట్టు సాధించాలని చూస్తోంది. 2019 నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. తాము గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెబుతామని, తెలుగుదేశం అయిదేళ్ళలో ఏపీకి చేసిన అన్యాయం గురించి చెబుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.
ఏపీలో బడుగు బలహీనులను ఆర్ధికంగా పరిపుష్టి చేసి కొత్త ఆర్ధిక వ్యవస్థను ఏపీలో క్రియేట్ చేశామని, సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచామని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. బీసీల ఖిల్లాగా ఉండే ఉత్తరాంధ్రాలో వైసీపీ బస్సు దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.