ఒకప్పుడు సెక్స్ అనే పదాన్ని ఉపయోగించడం పెద్ద తప్పుగా భావించేవారు. ముఖ్యంగా పిల్లల ముందు ఆ టాపిక్ తీసుకు రావడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ, కాలం మారింది. ప్రస్తుత సమాజంలో పిల్లల్లో కూడా సెక్స్ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో తమ పిల్లలకు అవగాహన కల్పించాలి. లేకపోతే ఆ విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఈ విషయం గురించి మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ విషయంలో తన కూతుళ్ళు పిహెచ్‌డి చేశారని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఓ పాడ్ కాస్ట్‌లో సెక్స్ గురించి ప్రస్తావిస్తూ ‘ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో లైంగిక అంశాల గురించి పిల్లలతో డిస్కస్ చేసేందుకు తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. కానీ, ఇది చాలా అవసరం. 90ల్లోనే నేను, మా అమ్మ ఈ విషయం గురించి చాలా ఓపెన్‌గా డిస్కస్ చేసుకునేవాళ్ళం. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. సెక్స్ గురించి ఏదైనా డౌట్ వస్తే అమ్మను ఓపెన్‌గానే అడిగేదాన్ని. అమ్మ కూడా అంతే ఓపెన్‌గా నాకు సమాధానం చెప్పేది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఎక్కడా మొహమాట పడను. నా కూతుళ్ళను కూడా అలాగే పెంచాను. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మా పిల్లలకు వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయంలో నా ఇద్దరు కూతుళ్ళు పిహెచ్‌డి చేశారు. మా చిన్నమ్మాయి అలీసాకు ఈ ఎడ్యూకేషన్‌పై అవగాహన ఎక్కువ. ఎందుకంటే అలీసా బయాలజీ స్టూడెంట్. ఇంట్లో తరచుగా శృంగారానికి సంబంధించిన టాపిక్స్ వస్తుంటాయి. వాటి గురించి మేము కామన్‌గానే మాట్లాడుకుంటాం’ అని వివరించారు సుస్మితా సేన్.