తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద రిజర్వేషన్ల అంశంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దివ్యాంగులకు ఐఏఎస్ లాంటి అత్యున్నత పోస్టుల్లో నియామకానికి రిజర్వేషన్ ఎందుకని ఆమె ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సి వుంటుందని ఆమె పేర్కొన్నడం వివాదాస్పదమైంది.
దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారని, ఆమె క్షమాపణ చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత మీడియాతో మాట్లాడుతూ ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా ఎంతకాలం పని చేశారో చెప్పాలని నిలదీశారు.
అసలే వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత కామెంట్స్ మరింత కుంగదీశాయని వాపోయారు. మళ్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడానికి స్మితా సిద్ధమా? తనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తుందేమో చూద్దామని ఆమె సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ మరోసారి సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు. బాలలత డిమాండ్‌పై ఆమె సెటైర్ విసిరారు. సివిల్ పరీక్షలు రాయడానికి తాను సిద్ధమని, కానీ వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ అనుమతించదేమో అని బాలలతకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్‌లకు సంబంధించి కూడా దివ్యాంగుల రిజర్వేషన్ వర్తింపజేసేలా పోరాడాలని బాలలత లాంటి వారికి స్మితా సూచించిన సంగతి తెలిసిందే. స్మితా సబర్వాల్ ధోరణిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధపడడం లేదు.
The post స్మితా సబర్వాల్ సెటైర్! appeared first on Great Andhra.