దిశ, ఫీచర్స్ : మనం అనేక సందర్భాల్లో ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ వంటి భావాలను వ్యక్త పరుస్తుంటాం. సమాజంలో మనుషుల మధ్య ఇటువంటి ఇంటరాక్షన్స్ గొప్ప ఓదార్పును ఇస్తాయి. మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయి. బాధితుల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతాయి. భరోసాను, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే ఇదంతా చాలా వరకు ఇతరులపట్ల వ్యవహరించే ప్రవర్తనగానే ఉంటుంది. కానీ ‘సెల్ఫ్ కైండ్‌నెస్’ కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి ఇతరులపట్ల దయ, కరుణ వంటివి చూపడం అవసరమే. కానీ తమపట్ల తాము కలిగి ఉండకపోతేనే నష్టం.
నిర్లక్ష్యం వద్దు..
చిన్నప్పటి నుంచి మనం ఇతరులపట్ల దయతో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. మనం కూడా ఇతరులకు నేర్పుతుంటాం. కానీ సెల్ఫ్- కైండ్‌నెస్ (స్వీయ దయ లేదా కరుణ) గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాదు. బదులుగా సెల్ఫ్‌సాక్రిఫై (ఆత్మత్యాగం), ఆత్మ విమర్శలపై మన విజయం ఆధారపడి ఉంటుందనే మాటలు వినడం, చెప్పడం చేస్తుంటాం. పాటించడం చేస్తుంటాం. కానీ జీవితంలో మనల్ని నిర్లక్ష్యం చేసుకునేంతగా, ఇతరులపట్ల జాలి, దయ, ఆత్మత్యాగం వంటివి కలిగి ఉండటం కొన్నిసార్లు మనకు నష్టం చేకూరుస్తాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో చదువులో, వృత్తిలో, చేసే ప్రతి పనిలో ఎక్కడైనా సరే ఇబ్బంది పడే చాన్స్ ఉంటుంది.
సెల్ఫ్ కైండ్‌నెస్ అంటే..
ఫ్రెండ్స్ లేదా ఆత్మీయులు ఎవరైనా కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం. మన ఆలోచనలు, భావాలు, చర్యలు వారిని ఓదార్చేలా, వారిని కష్టాల్లోంచి బయటపడేసేలా ఉంటాయి. ఇదే విషయాన్ని మనకు వర్తింపజేసుకోవడమే సెల్ఫ్ కైండ్‌నెస్ అసలు ఉద్దేశం అంటున్నారు నిపుణులు. దీనివల్ల కష్టతరమైన క్షణాల్లో మనల్ని మనం ఓదార్చుకుంటాం. బర్న్ అవుట్ కాకుండా ఉంటాం. అతి ఆలోచలు, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వయం సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాం. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటాం. అందుకోసం మైండ్ ఫుల్‌నెస్ కూడా అసవరం. ఇది సెల్ఫ్ కైండ్‌నెస్‌లో ఒక భాగం. మనపట్ల మనం దయగా ఉన్నప్పుడే మనలోని లోపాన్ని, వాస్తవాన్ని గుర్తించి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాం.
మానవత్వం – స్వీయ ఆలోచన
మనం సాధారణంగా మానవత్వాన్ని కలిగి ఉంటాం. ఇతరులపట్ల మాత్రమే కాకుండా మనపట్ల మనం కూడా దానిని ప్రదర్శించుకుంటే స్వీయ ఎదుగుదలకు దోహదపడుతుంది. మనం అనుభవించే ఇబ్బందులు, బాధల యొక్క అనుభవాలు కూడా మనల్ని మనుషులుగా ఏకం చేసేవిగానూ, ఆలోచింపజేసేవిగానూ, ఓదార్పునిచ్చేవిగానూ ఉంటాయి. ఉదాహరణకు నిద్రలేమితో బాధపడుతున్న ఒక వ్యక్తి రాత్రిళ్లు అతి ఆలోచనల నుంచి బయటపడాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర బాధితులు కూడా సరిగ్గా అదే పరిస్థితిని అనుభవిస్తుంటారని, తనలాగే బాధపడతుంటారని గుర్తించగలగాలి. అనేక విషయాల్లో ఇటువంటి ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్న అనుభూతిని దూరం చేస్తాయి. మనపట్ల మనం దయగా ఉండేలా చేస్తాయి. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి.