సినిమా హీరోయిన్ల‌లో అత్య‌ధిక ట్యాక్స్ పేయ‌ర్ గా నిలుస్తోంది దీపికా ప‌దుకోన్. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి క‌నీసం ప‌ది కోట్ల రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా ప‌న్నును చెల్లిస్తున్న హీరోయిన్ గా దీపిక నిలుస్తోంద‌ని స‌మాచారం.
సుమారు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆస్తుల‌ను క‌లిగి ఉండి, ఆ పై ప్ర‌తి సినిమాకూ ప‌ది నుంచి 15 కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ తో పాటు, ఇంకా యాడ్స్, సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ తో స‌హా వివిధ ఆదాయ మార్గాలున్న దీపిక ఏడాదికి ప‌ది కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ప‌న్నుగా చెల్లిస్తోంద‌ని స‌మాచారం. ఈ విష‌యంలో దీపిక‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే హీరోయిన్లు ప్ర‌స్తుతానికి లేన‌ట్టే.
ఆమె త‌ర్వాత ఈ జాబితాలో రెండో స్థానంలో అలియా భ‌ట్ నిలుస్తోంద‌ని స‌మాచారం. అలియా ఏడాదికి సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయ‌ల మేర ప‌న్నుగా చెల్లిస్తోంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం బాలీవుడ్ అలియా కెరీర్ ప‌తాక స్థాయిలో ఉంది. అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆమెను గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియమించుకుంటూ ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఆమె సంపాద‌న భారీ స్థాయిలో ఉంటోంది. దీంతో ఏడాదికి ఐదు కోట్ల రూపాయ‌ల స్థాయి వ‌ర‌కూ ప‌న్ను చెల్లించే స్థితిలో ఉంద‌ట అలియా.
ఇక వీరి త‌ర్వాత క‌త్రినాకైఫ్ హీరోయిన్ల‌లో హ‌య్యెస్ట్ ట్యాక్స్ పేయ‌ర్ అని స‌మాచారం. ప‌దేళ్ల కింద‌ట అయితే క‌త్రినా కైఫ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండేది. స‌రిగ్గా ద‌శాబ్దం కింద‌ట క‌త్రినా కైఫ్ కెరీర్ ప‌తాక స్థాయిలో ఉండేది. అప్ప‌ట్లో గూగుల్ లో అత్య‌ధికంగా వెత‌బ‌డిన హీరోయిన్ల జాబితాలో కూడా క‌త్రినానే తొలి స్థానంలో నిలిచింది. ఆ ద‌శ‌లోనే ఈమె హ‌య్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ హీరోయిన్ గా నిలిచింది. ఆ త‌ర్వాత దీపిక దూసుకు వెళ్లింది. దీంతో మూడు కోట్ల స్థాయి ప‌న్ను చెల్లింపు ద్వారా క‌త్రినా మూడో స్థానంలో ఉంది.
ఇక హీరోల్లో హ‌య్యెస్ట్ ట్యాక్స్ పేయ‌ర్ గా కొన్నేళ్ల నుంచి అక్ష‌య్ కుమార్ నిలుస్తున్నాడు. వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తూ, భారీ పారితోషికాలు తీసుకుంటూ ఉన్న అక్ష‌య్ ఏడాదికి 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ప‌న్ను చెల్లిస్తున్నాడ‌ని స‌మాచారం!