గతేడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరికొన్ని సినిమాలు ఓకే చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ రూపొందించే పనిలో ఉన్న హరీష్ శంకర్.. తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కథ బీవీఎస్ రవి అందిస్తున్నారట. ఇప్పటికే కథ విని మెగాస్టార్ ఓకే చేసినట్లు వినికిడి. చిరంజీవి కుమార్తె సుష్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందట.
అభిమానులు మెచ్చేలా హీరోలను ప్రజెంట్ చేయడంలో, కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ ని అలరించడంలో హరీష్ శంకర్ దిట్ట. అందుకే హరీష్ శంకర్ లాంటి దర్శకుడితో తమ హీరో మంచి కమర్షియల్ సినిమా పడితే బాగుంటుందని కోరుకునే అభిమానులు ఉంటారు. అలాంటిది బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో, మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న చిరంజీవిని హరీష్ డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ తో గతేడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించారు మెగాస్టార్. అలాంటిది హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా పడితే అంతకుమించిన వసూళ్లు వస్తాయి అనడంలో సందేహం లేదు.