రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. ప్రత్యర్థులైన పార్టీలు ఒకరిమీద ఒకరు లెక్కకు మిక్కిలిగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రాజకీయ ఆరోపణల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే.. ఆ ఆరోపణలన్నీ నిజం అయిఉండాలనే నిబంధన ఎంతమాత్రమూ లేదు. అబద్ధాలు, అవాకులు చెవాకులు పోగేసి కూడా రాజకీయ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాటికి రాజకీయ నాయకులే కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఇదొక పెద్ద ప్రహసనంలాగా నడుస్తూ ఉంటుంది.
అయితే ఇలాంటి రాజకీయ ఆరోపణలు, ఖండనముండనలు, ప్రత్యారోపణల పర్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త శకానికి శ్రీకారం చుడుతున్నారు. రాజకీయ ఆరోపణల్లోకి అధికారుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. తమ పార్టీ వారి గురించి ఎగస్పార్టీ వాళ్లు ఆరోపణలు చేస్తే.. వాటిని కలెక్టర్లు ఖండించాలని ఆదేశిస్తున్నారు.
కలెక్టరు అంటే పరిపాలనలో భాగంగా.. ఒక జిల్లాకు పరిపాలన అధికారిగా ప్రజల సేవలో ప్రభుత్వ విధులు నిర్వర్తించడం వరకు ఓకే గానీ.. ఇలా రాజకీయంగా తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రభుత్వం మీద వచ్చే రాజకీయ ఆరోపణలన్నింటికీ కౌంటర్లు ఇవ్వడం తమకెక్కడి బరువురా భగవంతుడా అని వారు అనుకుంటూ ఉండడం విశేషం.
నిజానికి రాజకీయ ఆరోపణలకు ప్రజల దృష్టిలో పెద్దగా విలువ ఉండదు. నాయకులు కూడా తమ మాటను ప్రజలు నమ్మాలని కోరుకోరు. ఒక్కశాతం అమాయకులు నమ్మినా చాలు.. తమ పని గడచినట్టే అనుకుంటారు. ఈ వ్యవహారం అంతా.. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తా.. అవతలి వాడే కడుక్కోవాలి అనే చందంగా ఉంటుంది.
నాయకుల్లో ప్రతివాడూ బురద చల్లేసి.. తమ వద్ద ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని అంటుంటారు. ఎవ్వరూ ఏ ఆధారాలూ బయటపెట్టిన సందర్భాలు ఉండవు. అలాంటి చెత్త రాజకీయ ఆరోపణలకు సంబంధించి కలెక్టర్లు కౌంటర్లు ఇవ్వాలని, ఖండించాలని ముఖ్యమంత్రి పురమాయించడం భావ్యంగా లేదని ప్రజలు అనుకుంటున్నారు.