అవును.. హీరోలను గెలిపించి రియల్ హీరోలు అనిపించుకున్న ఆ ఇద్దరికీ త్వరలో పదవులు రానున్నాయ్! ఎవరా ఇద్దరనే కదా మీ సందేహం.. ఆ ఇద్దరు మరెవరో కాదండోయ్.. ఒకరు ఎస్వీఎస్ఎన్ వర్మ, మరొకరు మహ్మద్ ఇక్బాల్. ఇంతకీ ఇద్దరికీ దక్కే కీలక పదవులు ఏమిటి..? పార్టీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఎంతో మంది ఉండగా ఈ ఇద్దరికే ఎందుకు ఇంత ప్రాధాన్యత టీడీపీ ఇవ్వాల్సి వస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పోటీచేసి గెలిచి.. డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈయన గెలుపు వెనుక కర్త, కర్మ, క్రియ ఎస్వీఎస్ఎన్ వర్మే. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే. ఎందుకంటే.. జనసేనకు మొత్తం 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోగా 100% స్ట్రైక్ రేటు పవన్ ప్రయత్నించగా.. సేనానిని పిఠాపురం నుంచి గెలిపించడానికి అన్నీ తానై చూసుకున్నారు వర్మ. అంతేకాదు.. కూటమి అధికారంలోకి రాగానే పిఠాపురంను మరో హైదరాబాద్ చేస్తానని నాడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కూడా. దీంతోపాటు సముచిత స్థానం కలిపిస్తానని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ మాటిచ్చారు. ఇందులో భాగంగానే తొలుత ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.
ఇక్బాల్‌కు ఇలా..!
ఐపీఎస్ అధికారి, రాయలసీమ ఐజీగా పనిచేసిన మహ్మద్ ఇక్బాల్ గతంలో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపైనే పోటీచేసి ఓడారు. అయితే ఈ ఎన్నికల్లో దీపికకు టికెట్ ఇవ్వడంతో అలకబూనిన ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయనుకున్న ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటు వేయడం జరిగింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న హిందూపురంలో బాలయ్య-దీపిక మధ్య టఫ్ ఫైట్ అని టాక్ నడిచింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఇక్బాల్ టీడీపీ కండువా కప్పుకోవడంతో బాలయ్యకు బాగా కలిసొచ్చింది. దీంతో బాలయ్య గెలవడమే కాదు.. ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టినట్లయ్యింది. అందుకే.. బాలయ్య గెలుపునకు కృషి చేసిన ఇక్బాల్‌కు సముచిత స్థానం కల్పించాలని బావ చంద్రబాబును బాలయ్య పట్టుబట్టారట. అంతేకాదు.. నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కూడా ఆయనకే ఇవ్వాలని హ్యాట్రిక్ ఎమ్మెల్యే భావిస్తున్నారట. ఎమ్మెల్యే కోటాలో వర్మ, ఇక్బాల్‌ను అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చూశారుగా.. హీరోలను గెలిపించిన రియల్ హీరోలు, రాజకీయ నేతల కథ..!