సినిమా రంగంలో ఉన్న ఏ నటుడికైనా తన కొడుకు కూడా తనలాగ నటుడై మంచి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటాడు. కొందరు తమ కొడుకు హీరో అవ్వాలని కలలు కంటారు. కానీ, అందరికీ అది సాధ్యమయ్యే పని కాదని, విధి కొన్ని సందర్భాల్లో వక్రించి వారి ఆశల్ని అడియాసలు చేస్తుందని వారు ఊహించరు. సౌత్ ఇండియాలోనే కాదు, ఎన్నో భాషల్లో రాణిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాజర్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా వివిధ శాఖల్లో తన ప్రతిభను కనబరుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
స్వతహాగా హాస్యప్రియుడైన నాజర్ ఎప్పుడూ అందర్నీ నవిస్తూ సరదాగా ఉంటారు. కానీ, ఆయన జీవితంలోని విషాదం మాత్రం బయట పడనీయడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అబ్దుల్‌ను హీరోగా చూడాలన్నది ఆయన ఆశ. దానికి తగ్గట్టుగానే కొడుకుని తీర్చిదిద్దాడు. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఇక హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న తరుణంలో అబ్దుల్ కారుకు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అబ్ధుల్ మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికీ మామూలు మనిషి అవ్వలేకపోయాడు. చికిత్స చేయిస్తున్నప్పటికీ గత 9 ఏళ్ళుగా మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు లూతుఫుద్దీన్ కొన్ని తమిళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.