తెలంగాణ సిఎమ్ రేవంత్ రెడ్డి దృష్టి హైదరాబాద్ మీద వుంది. ఇప్పటి నుంచి కాదు. ఎన్నికలు అయిన దగ్గర నుంచి. ఎందుకంటే తెలంగాణ గుండె లాంటి హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు. అప్పటి నుంచి, ఎందుకిలా అనే దాని మీద రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి వున్నారు. దాని కోసం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగర ఎన్నికలు వస్తాయి. అప్పటిలోగా హైదరాబాద్ వాసుల అభిమానాన్ని కాంగ్రెస్ గెల్చుకోవాల్సి వుంది.
హైదరాబాద్ మీద కాంగ్రెస్ దృష్టిని ఈ రోజు బడ్జెట్ కూడా చూపించింది. హైదరాబాద్ జంట నగరాల అభివృద్ది పనుల కోసం పదివేల కోట్లు కేటాయించారు. ఈ పది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుందా.. అన్నది వేరే సంగతి. హైదరాబాద్ ప్రగతికి కాంగ్రెస్ కట్టుబడి వుందని చెప్పడమే ఈ కేటాయింపు ఉద్దేశం. దీని వెనుక చాలా లెక్కలు వున్నాయి.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు పైసా ఇవ్వలేదు. దీన్ని చదువుకున్న ఓటర్లు గమనిస్తూనే వున్నారు. అలాంటి ఓటర్లు ఎక్కువగా వుండేది జంటనగరాల్లో. అలాగే భారత్ రాష్ట్ర సమితికి మద్దతు దారులు వున్నది కూడా జంట నగరాల్లో. ఈ రెండు ఓటు బ్యాంకులను తమ వైపు తిప్పుకోవడమే ఈ పదివేల కోట్ల కేటాయింపు లక్ష్యం.
మొత్తం మీద రేవంత్ రెడ్డి సరైన దారిలోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా అక్కౌంట్లలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. పైగా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పట్ల సానుకూల ధోరణి కనిపిస్తున్నాయి. రాను రాను పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందేమో చూడాలి.