Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పక్కనే నివసించే హోమ్ గార్డ్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామంతపూర్ లోని సత్య నగర్ లో నాగరాజు, శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాగరాజు హోం గార్డ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్, నాగరాజుల ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. వీరి ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మృతికి హోం గార్డు నాగరాజే కారణమంటూ శ్రీనివాస్ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు తన పిస్టల్ తో శ్రీనివాస్ ను పలుమార్లు బెదిరించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హోం గార్డు నాగరాజు వేధింపులు తాళలేకే శ్రీనివాస్ మరణించాడని ఆరోపిస్తూ….శ్రీనివాస్ మృతదేహంతో నాగరాజు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోం గార్డు నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Source link