AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కీలక బిల్లులను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వేపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ రవాణా వాహనాల పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్- గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. నేటి సమావేశాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ శాసన సభ్యులు బహిష్కరించారు. దీంతో విపక్షం లేకుండానే మొత్తం 10 బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.