దిశ, ఫీచర్స్ : భూమిపైన అప్పుడప్పుడు కొన్ని వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వింత వింత ఆకారాలతో పుట్టే మనుషుల గురించి, జంతువుల గురించి మనం వింటూనే ఉంటాం. కొన్నిసార్లు అలాంటి జీవులను చూస్తే చాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక జీవిని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అందరినీ అబ్బురపరుస్తున్న ఆ జీవి ఏంటి అనుకుంటున్నారా. అది ఏంటో కాదండి ఒక తేలు. కానీ ఈ తేలు అన్నిటికన్నా వింతగా 8 కళ్ళు, 8 కాళ్ళతో ఉంది.
థాయిలాండ్‌లోని ఫేట్‌చబురి ప్రావిన్స్‌లోని కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో కొత్త రకం తేలును కనొగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపుతున్నారు. ఈ తేలుకు ఎనిమిది కళ్ళు, ఎనిమిది కాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రకం తేళ్లు మూడు మగ, ఒక ఆడ తేళ్లు ఉన్నాయని కొన్ని నమూనాల ఆధారంగా కనుగొన్నారు. 8 కళ్ళు, 8 కాళ్ళు ఉన్నప్పటికీ ఈ తేళ్లు అన్నింటికన్నా చిన్నవిగా ఉంటాయని వారు పేర్కొన్నారు.
రాళ్ల రంగులో తేళ్లు..
మీడియా నివేదికల ప్రకారం శాస్త్రవేత్తలు కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో వన్యప్రాణుల కోసం వెతుకుతున్నారు. ఇంతలో వారు రాళ్ల కింద దాక్కున్న తేళ్లను చూశారట. ఈ స్కార్పియన్ రంగు ఖచ్చితంగా రాతి రంగు లాగా ఉందని, మొదటి చూపులో రాయి, తేళ్ల మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. తొలుత ఆ తేళ్లను చూసిన శాస్త్రవేత్తలు.. ఏదో జీవి ఆహారం వెతుక్కుంటూ వెళుతోందని భావించి.. దాని దగ్గరికి వెళ్లి నిశితంగా పరిశీలించారట. ఆ తర్వాత అది తన నాలుగు పిల్లలను ఎత్తుకుని వెళ్తున్న ఆడ తేలు అని తెలిసింది.
ఈ కొత్త జాతి తేళ్లు ఒక అంగుళం పొడవుతో పాటు చర్మం పై వెంట్రుకలను కూడా కలిగి ఉన్నాయి. అయితే వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వాటికి ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల జూటాక్సా జర్నల్‌లో ప్రచురితమైంది.