Borlaug Dialogue KTR : గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని మంత్రి కేటీఆర్ కు అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ను ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం పంపారు. అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్ లో ఈ సమావేశం జరుగనుంది. ఈ ఏడాది జరుగనున్న బోర్లాగ్ డైలాగ్ సమావేశంలో ” స్థిరమైన, సమానమైన, పోషకమైన ఆహార వ్యవస్థను సాధించడానికి పరివర్తన పరిష్కారాలు ” అనే ప్రధాన అంశం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు ఈ సమావేశానికి నేరుగా హాజరవుతారు. దీంతో పాటు వేలాది మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ప్రతి ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు.