విజయ్ దేవరకొండ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘ఖుషి’తో ప్రేక్షకులను పలకరించిన విజయ్.. ప్రస్తుతం సితార బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. దానితో పాటు దిల్ రాజు నిర్మాణంలోనే రవికిరణ్ కోలా దర్శకత్వంలోనూ ఓ చిత్రం అంగీకరించాడు. వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దీనికి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.
మైత్రి బ్యానర్ లో ఇప్పటికే విజయ్ ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ అనే రెండు సినిమాలు చేశాడు. అయితే ఆ రెండూ బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ‘డియర్ కామ్రేడ్’ యావరేజ్ టాక్ తెచ్చుకోగా, ‘ఖుషి’ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా భారీ బిజినెస్ కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయినప్పటికీ విజయ్ తో మైత్రి ముచ్చటగా మూడోసారి చేతులు కలుపుతోంది. దీనికోసం డైరెక్టర్ రాహుల్ ని రంగంలోకి దింపుతోంది. ‘ది ఎండ్’తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్.. విజయ్ తో ‘టాక్సీవాలా’ చేసి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత నానితో చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’తోనూ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో ఓ పీరియాడిక్ ఫిల్మ్ చేయడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు విజయ్ తో అదే కథ చేయబోతున్నాడో లేక కొత్త కథ చేయబోతున్నాడో చూడాలి.