తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గ తేడాది జనవరి నుంచి సెప్టెంబరు నెల వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే… ఏడాది ఇదే సమయానికి 5,264 కేసులు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. అయినా గాని సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.

వర్షాకాలం వస్తే గతంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు విపరీతంగా ఉండేవని, సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో అమలు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ వంటి పథకాల వల్ల రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయని వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా గడచిన వారం, పది రోజులుగా ఫీవర్ కేసులు స్వల్పంగా పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణంకాలు చెబుతున్నాయని అన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయాల్లో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. మలేరియా, డెంగీ లతో ఒక్క పేషంట్ కూడా మృతి చెందకుండా వైద్య ఆరోగ్యశాఖ జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించారు.

డెంగీ, మలేరియా సాధారణ వ్యాధులేనని మంత్రి హరీష్ రావు చెప్పారు. పరిస్థితి విషమించక ముందే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు సరిపడా పడకలు, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. రక్తం, ప్లేట్ లెట్స్ సరఫరాలో కొరత లేదని తెలిపారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఈ జ్వరాలు తగ్గుముఖం పట్టాయని మంత్రి చెప్పారు. దోమల వ్యాప్తి లేకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

వ్యాధి లక్షణాలు గుర్తించాలి

ప్రతి ఒక్కరూ డెంగీ వ్యాధి లక్షణాలను గుర్తించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. డెంగీ వ్యాధి సోకితే శరీరంపై ఎర్రమచ్చలు రావడం, చెవిలో నుంచి రక్తం కారడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తం పడటం, యూరిన్ లో రక్తం రావడం, ఒంటిపై దద్దుర్లు రావడం తదితర లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని కోరారు. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు రక్త పరీక్షలు చేసుకొని ప్లేట్ లెట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు.

డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నివారణకు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని తెలిపారు. ఇంటి చుట్టూ పరిసరాలు మురుగునీరు నిల్వ లేకుండా చూసుకుంటే దాదాపు దోమల బెడద నుంచి పూర్తిగా దూరమైనట్లేనని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే వ్యాధి బారి నుండి త్వరగా కోలుకోవచ్చని సూచించారు.

Source link