త‌న‌ను అవినీతిప‌రుడిగా ముద్ర‌వేసి, నెల‌ల త‌ర‌బ‌డి జైలుపాలు చేయ‌డంలో చంద్ర‌బాబు కీల‌క వ్య‌క్తిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భావిస్తున్నారు. త‌న‌ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రి అంతు చూడ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పెట్టుకున్నారు. తెల్లారి లేచిన‌ప్ప‌టి నుంచి త‌న‌పై మీడియాను అడ్డు పెట్టుకుని విష ప్ర‌చారం చేస్తున్న ఈనాడు మీడియాధిప‌తి రామోజీరావుకు జ‌గ‌న్ ఏ గ‌తి ప‌ట్టించారో చూస్తున్నాం. జ‌గ‌న్ దెబ్బ‌కు మంచ‌మెక్కి.. ఇది కాల మ‌హిమో, జ‌గ‌న్ మ‌హిమో అని రామోజీ ఆవేద‌న చెంద‌డాన్ని చూశాం.
ఇలా ఒక్కొక్క‌రి లెక్క జ‌గ‌న్ స‌రి చేస్తున్నారు. రాజకీయంగా ఇది లాభ‌మా? న‌ష్టమా? అనేది వేరే సంగ‌తి. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబు 18 రోజులుగా ఊచ‌లు లెక్కిస్తున్నారు. ఈ రోజో, రేపో ఆయ‌న కుమారుడు లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. వీటికే టీడీపీ , ఎల్లో మీడియా గ‌గ్గోలు పెడుతోంది. భూమి త‌ల‌కిందుల‌వుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు.
ఇంత‌కు మించి నారా, నంద‌మూరి కుటుంబాల‌కు షాక్ ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భారీ స్కెచ్ వేశార‌ని స‌మాచారం. నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల‌పై కూడా త్వ‌ర‌లో కేసులు న‌మోద‌య్యేందుకు సీఐడీ ప‌క‌డ్బండీ వ్యూహంతో ముందుకెళుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందులో భాగంగానే ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్‌) కుంభ‌కోణంలో నారా లోకేశ్‌ను 14వ నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఈ మేర‌కు ఏసీబీ కోర్టుకు స‌మ‌ర్పించిన మెమోలో సీఐడీ లోకేశ్‌ను నిందితుడిగా పేర్కొంది.
ఈ కేసులో ప్ర‌ధానంగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ‌ను చేర్చ‌డం వెనుక సీఐడీ భారీ వ్యూహంతో ముందుకు వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ‌లో బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి కీల‌క హోదాల్లో ఉన్నారు. లోకేశ్ కేవ‌లం డైరెక్ట‌ర్ మాత్ర‌మే. కానీ లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి, త‌ల్లి భువ‌నేశ్వ‌రి మేనేజ్‌మెంట్ హోదాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభ‌కోణంలో హెరిటేజ్ భారీ ల‌బ్ధి పొందింద‌ని సీఐడీ చెప్ప‌డం వెనుక.. బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రిల‌ను అవినీతిలో భాగ‌స్వామ్యం చేసేందుకే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.
త‌న‌ను అవినీతిప‌రుడిగా ముద్ర‌వేసిన చంద్ర‌బాబు ఆట క‌ట్టించ‌డానికి ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా జ‌గ‌న్ వ‌దులుకోవాల‌ని అనుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి, కుమారుడు లోకేశ్‌, ఆయ‌న భార్య బ్రాహ్మ‌ణి.. ఇలా కుటుంబ‌మంతా అవినీతికి పాల్ప‌డింద‌ని నిరూపించ‌డానికి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఫైబ‌ర్ గ్రిడ్‌, స్కిల్ స్కామ్ తదిత‌ర వాటిని అస్త్రాలుగా సంధించ‌డంలో ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ఇక మిగిలింది భువనేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి మాత్ర‌మే. అయితే వీళ్ల‌ను కూడా జైలుకు పంపేంత అవివేకంగా జ‌గ‌న్ ఆలోచిస్తారా? అనేది కాలం తేల్చాల్సి వుంది.