Bhatti Vikramarka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్ని అసత్యాలే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈక్రమంలోనే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికి తన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తానని.. తనతో కర్ణాటక వస్తే అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. విమానంలో కాకపోతే బస్సులో వస్తానన్నా.. బస్సుు టికెట్లు బుక్ చేస్తానని తెలిపారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా తప్పుడు ప్రచారం చేయడం లేదని, నిలబెట్టుకోలేని హామీలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. బడ్జెట్ అంచనా వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ లౌకిక వాది అని.. దేశాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేశాడని వివరించారు. అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఒవైసీపై కూడా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే బీజేపీకి సపోర్ట్ చేయడమేనంటూ తెలిపారు. నిజంగా నీవు సెక్యులర్ నాయకుడివే అయితే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలని సూచించారు.
వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ప్రారంభించిన మానిక్ రావు ఠాక్రే
ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు హామీలను.. అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. ప్రతీ మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని తెలిపారు. అలాగే రైతుకు క్వింటాలుకు 500 బోనల్ ఇస్తామని, పేదలకు ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఐదు లక్షల హామీ విద్యార్థులకు ఇస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రతీ ఇంటికి గ్యారంటీ కార్డు ఇస్తామని… ఈ కార్డులో ఇంటి స్థలం ఉంటుంది అన్నారు.
హరీష్ రావు ఏమన్నారంటే..?
కాంగ్రెస్ నాయకులంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణకు వచ్చి మాట్లాడాలంటూ సూచించారు. కాంగ్రెస్ గెలిస్తే 6 నెలలకు ఓ సీఎం మారతారంటూ సెటైర్లు వేశారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం శంకరంపేటలో వంద డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొత్తం 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ… పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసి, ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు, ప్లాట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా చేస్తాడని చెప్పుకొచ్చారు. నారాయణ్ ఖేడ్ లో ఇచ్చిన హామీ మేరకు… అన్నీ చేసి చూపించాడన్నారు. అలాగే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.