ByGanesh
Wed 27th Sep 2023 09:37 PM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పరిణామాలు ఎలా ఉన్నాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో బీభత్సంగా సింపథి వర్కవుట్ అవుతుందని భావించారు? కానీ నిజానికి అనుకున్న మేర సింపతీ వర్కవుట్ అయ్యిందా? టీడీపీ గ్రాఫ్ పెరిగిందా? అనేది హాట్ టాపిక్‌గా మారాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ అయితే బీభత్సమైన సానుభూతి వస్తుందని తొలుత టీడీపీ భావించిందనడంలో సందేహం లేదు. 73 ఏళ్ల వయసులో ఆయనను జైలుకు పంపించడం.. అది కూడా కేవలం రూ.300 కోట్లు స్కాం చేశారని పంపడంపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.
14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి రూ.300 కోట్ల కోసం కక్కుర్తి పడతారా? అని జనంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు స్థాయి, వయసు వంటి అంశాలతో టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహించారు. అసలు చంద్రబాబు జైలుకు వెళ్లడానికి ముందు పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉందనే దానిపై టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఎందుకోగానీ ఈ విషయంలో నేతలు ఊహించిన స్థాయిలో సింపతి అయితే రాలేదని తెలుస్తోంది. అవినీతి మచ్చ అనేదే లేని చంద్రబాబును జైలుకు పంపడంపై కాస్త గ్రామాల్లో అయితే మార్పు వచ్చిందట. కానీ ఇంకా ఎక్కువగా రావాలని భావిస్తున్నారట.
అయితే నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి కాస్త జనంలోకి రావడం.. క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం వంటివి మాత్రం వర్కవుట్ అవుతున్నాయని టాక్. ఎప్పుడూ జనంలోకి రాని వీరిద్దరూ జనంలోకి వస్తుండటంతో ముఖ్యంగా మహిళల్లో చర్చ ప్రారంభమైందని టాక్. దీనిని సానుకూలంగా మలుచుకుంటే చాలా వరకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారట. కానీ ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపించే నాయకత్వం టీడీపీలో ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో చర్చ జరిగితే సరిపోదు. దానిని రాజకీయంగా మలుచుకోవాలి. అప్పుడే పార్టీకి కలిసొస్తుంది. ప్రస్తుతం పార్టీకి కీలక తరుణం. ఇప్పుడు కూడా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే ఇక ఆ తరువాత మరింత కష్టమవుతుంది. పొలిటికల్‌గా సక్సెస్ అయితే చాలు.. అన్ని ఆరోపణలు.. అన్ని నిందలూ కొట్టుకుపోతాయి. లేదంటే టీడీపీ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోక తప్పదని కేడర్ చెబుతోంది.
Is sympathy for TDP a workout?:
TDP chief Chandrababu Naidu arrested in AP skill case