హీరో విజయ్ ఆంటోని కుటుంబంలో ఇటీవల జరిగిన విషాదం గురించి తెలిసిందే. కుమార్తెను కోల్పోయిన దు:ఖంలో ఉన్న విజయ్ ఆంటోని దాన్ని అధిగమించి తను హీరోగా నటించిన ‘రత్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తన చిన్న కుమార్తెతో కలిసి హాజరయ్యారు. తన వ్యక్తిగత సమస్యల వల్ల తన నిర్మాత నష్టపోకూడదని భావించిన విజయ్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. ఆ బాధతోనే జీవించడం అలవాటు చేసుకుంటున్నాను. బాధల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నంత సేపు ఆ హాల్‌లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంత బాధలోనూ నిర్మాత శ్రేయస్సు కోరి ఈవెంట్‌కి రావడం అభిమానుల్ని కలచివేసింది. ఈ విషయంలో విజయ్ ఆంటోని గొప్పతనం గురించి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘సమాజంపై మీకు ఉన్న బాధ్యత చాలా గొప్పది. అందుకే గొప్పగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నారు. బాధ తొలగిపోయి మీరు సంతోషంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. మీరు ధైర్యంగా ఉండండి’ అంటూ నెటిజన్లు చేస్తున్న పోస్ట్‌లపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.