మా ఫ్రెండ్‌ వెటకారపు వెంకటేశ్వరరావు ఈ రోజు ఉదయాన్నే మా ఇంటికొచ్చాడు. ‘రేయ్‌..త్వరగా రెడీ అవురా.. విజ‌య‌వాడ‌లో ఎక్కడ పెద్ద టపాసుల అంగడి వుంటే అక్కడికి పోవాలి.. టపాసులు కొనాలి’ అంటూ హడావుడి చేశాడు.
‘దీపావళి ఇంకా నెల రోజులకుపైగా వుంది కదరా.. అప్పుడే టపాసులెందుకురా’ అన్నాను.
‘అవన్నీ నీకెందుకురా….ఈరోజు చానా టపాసులు కొనాలి. 1000 వాలా, 2000 వాలా, 3000 వాలా, టౌట్‌లు, బాంబులు, ఆకాశంలో పేలే ఆకాశశివలు.. ఇలా పెద్దపెద్ద శబ్దాలు వచ్చే టపాసులే కొనాలి’
‘అన్నీ కొందువుగానీ….పండగకు దగ్గర్లో కనుక్కోవచ్చులేరే’ అంటే…‘అవన్నీ తరువాత చెబుతానుగానీ…ముందు నువ్వు రెడీ అవు. టపాసులు వేసుకొచ్చేదానికి ట్రాక్టర్‌ మాట్లాడాలి’ అన్నాడు.
‘ట్రాక్టరా…అన్ని టపాసులు కొని ఏం చేస్తావురా…నీకేమైనా పిచ్చా’ అన్నాను. ‘అన్నీ చెబితేగానీ నువ్వు కదిలేలా లేవుగానీ…ఈ టపాసులు దీపావళి కోసం కాదురా…ఈ రోజు కాల్చ‌డానికి…’ అని చెప్పుకొచ్చాడు.
‘నీకు నిజంగానే పిచ్చిపట్టిందిరా….ఈ రోజు టపాసులు కాల్చితే నన్ను పిచ్చోడని అంటారు’ అనే సరికి….
‘నీకేమీ తెలియదురా…చెబుతాను విను. ట్రాక్టర్‌ నిండా టపాసులు తెచ్చి మన ఊరి గ్రౌండ్‌లో పెట్టి, ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి కాల్చుతాను…’ అని వాడు చెబుతుండగానే…..
‘టపాసులు కాల్చేదానికి కూడా మూర్తం ఏమైనా పెట్టినావా ఏందిరా…’ అని అడ్డుపడినాను. దానికి వాడు ‘చెప్పేది పూర్తిగా వినవు….ప్రశ్నలపైన ప్రశ్నలు వేస్తావు ’అంటూ ఇంకా చెప్పేది కొనసాగించినాడు.
‘చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక శబ్దం చేసి మద్దతు ప్రకటించమని తెలుగుదేశం వాళ్లు పిలుపునిచ్చినారు. అందుకే నేను టపాసులు కాల్చాలనుకుంటున్నాను’ అని చెప్పినాడు.
‘ఒరేయ్‌…నువ్వు చేసేది చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా చేస్తున్నట్లు లేదు…చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినందుకు సంబరపడుతూ సంబరాలు చేసినట్లు వుంటుందిరా…అయినా నువ్వు చంద్రబాబు అభిమాని కూడా కాదు కదరా’ అన్నాను నేను.
‘అదంతా నాకు తెలియదు…నాకు టపాసులు కాల్చేదంటే ఇష్టం. అందుకే టపాసులు కాల్చుతాను….’ అన్నాడు వెటకారపు వెంకటేశ్వరరావు.
నాకు అప్పుడర్థమయింది…ఇది వెటకారపు వెంకటేశ్వరరావు చేస్తున్న వెటకారమని.
‘చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా కార్యక్రమం నిర్వహించాలంటే ఒక అర్థపర్ధం వుండాలి…ఇదేం కార్యక్రమం…’ అన్నాడు.
‘ఇంటిలో వుండి కంచాలు కొట్టడం, విజిళ్లు వేయడం, కారు హారన్లు మోగించడం, చప్పట్లు కొట్టడం….ఇవేమి కార్యక్రమాలు….ఇవన్నీ సంతోషంగా చేసేవి. అంతేగానీ….నిసరనగా చేసేవి కావు’ అని వివరణాత్మకంగా చెప్పాడు.
‘అయితే…ఎలా నిరసన తెలపాలంటావు’ అంటే….‘ఎక్కడో ఫేస్‌బుక్‌లో చూశాను…చంద్రబాబుపైన నిజంగా ప్రేమవుంటే…కొరడాలతో తమను తాము కొట్టుకుని నిరసన తెలియజేయండి’ అని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు గురించి చెప్పి, నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.