ఏసీబీ కోర్టులో టీడీపీ చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. రేపు 11:15కి తిరిగా మిగతా వాదనలను వింటామని జడ్జి తెలిపారు. అయితే నేటి ఉదయం నుంచి ఈ కేసులో వాదనలు సుదీర్ఘంగానూ.. హోరాహోరీగా జరిగాయి. ఈ కేసులో ఉదయం నుంచి క్షణక్షణం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు తరుఫున ప్రమోద్ దూబే వాదనలు..
సుప్రీంకోర్టులో మాదిరిగానే ఏసీబీ కోర్టులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సుప్రీంకోర్టుకు న్యాయవాది ప్రమోద్ దూబే చంద్రబాబు తరుఫున వాదించారు. అసలు స్కిల్ కేసులో చంద్రబాబు తరుఫున తప్పిదమే జరగలేదని కోర్టుకు తెలిపారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలపలేదన్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ నిర్దారించిందన్నారు. ఆ కమిటీలో అసలు చంద్రబాబు లేరని దూబే కోర్టుకు తెలిపారు. ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారన్నారు.
సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకూ మధ్యంతర బెయిలును పొడిగించిందని దూబే వెల్లడించారు. ఇక చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేసి ఆపై విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ నిర్వహించి.. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారన్నారు. అసలిప్పుడు కస్టడీ అవసరం ఏముందని దూబే ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదంతోనే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని… అలాంటప్పుడు చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారని ప్రమోద్ దూబే వాదించారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదని… సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారని దూబే తెలిపారు. కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపిందన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు..
‘‘స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచాం. వాటిని పరిశీలిస్తే చంద్రబాబు పాత్ర ఉందని అర్థమవుతుంది. చంద్రబాబు పాత్ర ఉందని.. ఫిక్షనల్ స్టోరీ ఏమీ చెప్పడం లేదు.స్కామ్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టే మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని, బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నాం. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉంది. ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోయారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉంది. స్కిల్ కుంభకోణంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారు.ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణలో ఉండగానే అంటే 26-07-2018న 17ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు’’ అని ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదించారు.