ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తెలుగునేల మీది నుంచి ఈ దేశంలో అత్యున్నత పదవులకు ఎదిగిన అతికొద్ది మంది నాయకుల్లో ఒకరు. ఆయన భారత దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. దానికి ముందు సుదీర్ఘకాలం తన రాజకీయ జీవితాన్ని వివిధ హోదాలలో గడిపారు. అనేక అనుభవాలను ప్రోది చేసుకున్నారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మాజీ అయిన తర్వాత.. ప్రజాజీవితంలో ఉన్నారు. ఆయనకు ఇక ఎలాంటి రాజకీయ అవసరాలు, ఆ అవసరాలకోసం ముఖప్రీతి మాటలు మాట్లాడడం అవసరం లేదు. అయినా సరే.. ఇప్పటికీ ఆయన సూటిగా మాట్లాడకుండా, డొంకతిరుగుడు కబుర్లు చెబుతున్నారంటే.. ఆశ్చర్యం కలుగుతోంది.
తాజాగా ఆయన హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశానికి చెందిన దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా ఉండగా చేసిన ప్రసంగాలతో తీసుకువచ్చిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నాయకులను ఎన్నుకోవాలని వెంకయ్య హితోపదేశం కూడా చేశారు.
అయితే తమాషా ఏంటంటే.. రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి కూడా.. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకపోయినా కూడా.. వెంకయ్య ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడడం. కొందరి తీరు అసహ్యంగా ఉందని ఆయన ఎందుకు అనాలి? అచ్చంగా ఆ అసహ్యకరమైన నాయకులెవ్వరో చెప్పవచ్చు కదా. ఎలాంటి వారిని ఎన్నుకోవాలో.. ప్రజలకు హితోపదేశం చేయదలచుకున్నప్పుడు.. ఏ నాయకులను అసహ్యించుకోవాలో పేర్లతో సహా చెప్పవచ్చు కదా..! కానీ ఆయన అందుకు మాత్రం పూనుకోరు. లౌక్యం ప్రదర్శిస్తారు.
ఇదే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘తనను మాజీ ఉపరాష్ట్రపతిగా గుర్తించడం కంటె.. వెంకయ్యనాయుడుగా గుర్తిస్తేనే ఎక్కువ ఆనందం’ అని కూడా వెల్లడించారు. ఇలాంటి నిరాడంబర వైఖరి చాలా మందిలో ఉండదు. ప్రోటోకాల్ కోసం ఎగబడతారు. కానీ, తనదైన గుర్తింపు దొరికితే అంత ఆనందం ఉందని అనుకుంటున్నప్పుడు వెంకయ్యనాయుడు దానిని పొందడం చాలా ఈజీ అని ప్రజలు అంటున్నారు.
ఆయన ఎంచక్కా.. మాజీ ఉపరాష్ట్రపతికి దక్కే ప్రోటోకాల్, సెక్యూరిటీ వ్యవహారాలన్నిటినీ అధికారికంగా వదిలించుకుంటే గనుక.. ఇక అందరూ మామూలు వెంకయ్యనాయుడుగానే తప్పకుండా గుర్తిస్తారు. ఆయన కోరిక తీరుతుందని ప్రజలు అంటున్నారు.