తమ సినిమాని ఇతర భాషల ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం మేకర్స్ పలు భాషల్లో సినిమాని విడుదల చేస్తుంటారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ టీం అయితే వినూత్నంగా ఆలోచించి, ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. వినికిడి లోపమున్న వారికోసం తమ సినిమాని ఇండియన్ సైన్ ల్యాంగ్వేజ్(ఐఎస్‌ఎల్)లో విడుదల చేయాలని మూవీ టీం నిర్ణయించింది.
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా భాషలతో పాటు, వినికిడి లోపమున్న వారికోసం ప్రత్యేకంగా ఇండియన్ సైన్ ల్యాంగ్వేజ్ లో కూడా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చర్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాని కూడా ఇండియన్ సైన్ ల్యాంగ్వేజ్ లో విడుదల చేయనున్నారని సమాచారం. గతంలో కొన్ని సినిమాలు ఇలా ఇండియన్ సైన్ ల్యాంగ్వేజ్ లో విడుదలయ్యాయి. అయితే తెలుగులో మాత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’నే మొదటి సినిమా కావడం విశేషం.