దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్ గా కార్మికులకు పంచడం జరుగుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా బోనస్ ను ప్రకటిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాక పూర్వం 2013 -14లో ఇది 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని పెంచుతూ 2014-15 లో 21 శాతం, 2015-16లో 23 శాతం (245.21 కోట్లు) 2016-17లో 25 శాతం (98.85 కోట్లు), 2017-18 లో27 శాతం (327.44 కోట్లు), 2018 19 లో 28 శాతం (493.82 కోట్లు), 2020-21 లో29 శాతం (79.07 కోట్లు), 2021-22లో 30 శాతం (368.11 కోట్లు) ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు 2222 కోట్ల రూపాయల లో 32 శాతం అనగా రూ.711.18 కోట్ల ను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించాలని ఇటీవలే ఆదేశించారు. అలాగే దసరా పండుగకు ముందే ఇది కార్మికుల చేతికి అందేలా చూడాలని ఇటీవల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం పూర్తి ఏర్పాట్లను చేసింది.