స్టార్ హీరో నటించిన సినిమా టీజర్ లేదా ట్రయిలర్ వస్తుందంటే చాలు, అది ప్రసారం చేసే థియేటర్ ధ్వంసం అవ్వడం కామన్ అయిపోయింది. హైదరాబాద్ సంధ్య, సుదర్శన్ థియేటర్లలో ఇలా ఎన్ని కుర్చీలు విరిగాయో లెక్క లేదు. ఇప్పుడు చెన్నైలోని రోహిణి థియేటర్ వంతు వచ్చింది.
రోహిణి థియేటర్ లో ఈరోజు లియో ట్రయిలర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిజానికి ట్రయిలర్ లాంచ్ కోసం ఈవెంట్ చేయాలనుకున్నారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. నేరుగా యూట్యూబ్ లో ట్రయిలర్ ను పెట్టారు, పనిలోపనిగా ఫ్యాన్స్ కోసం థియేటర్ లో ప్రసారం చేశారు.
తమ అభిమాన హీరో విజయ్ నటించిన లియో సినిమా ట్రయిలర్ చూడ్డానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. రోహిణి థియేటర్ కిక్కిరిసింది. ట్రయిలర్ మొదలైంది. ఇక థియేటర్ ధ్వంసం కూడా మొదలైంది. ట్రయిలర్ చూసిన ఆనందంలో చాలామంది ఫ్యాన్స్ థియేటర్ లో సీట్లు విరగ్గొట్టారు, మరికొంతమంది సీట్లు కోశారు. ఇంకొంతమంది సీట్లలో కూల్ డ్రింక్ పోశారు.
అక్కడితో అయిపోలేదు, ట్రయిలర్ ప్రసారం పూర్తయిన తర్వాత బయటకొచ్చే దారిలో అడ్డంగా ఉన్న ఇనుప గేటును కూడా విరిచేశారు అభిమానులు. ఓవైపు థియేటర్ చెక్క తలుపులు కూడా విరిగాయి.
తాజా ఘటనలో రోహిణి థియేటర్ ను తాత్కాలికంగా మూసేశారు. పూర్తిస్థాయిలో రిపేర్లు చేసి, పునరుద్ధరించిన తర్వాత తెరుస్తారు. జరిగిన డ్యామేజీపై లియో నిర్మాతలు, యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.