ఏపీ లిక్కర్ స్కామ్ ఈడీ, సీబీఐకి కనిపించడంలేదా?
రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై విచారణ చేసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీస్తూ, జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు వెళ్లే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. వైసీపీ నేతలకు చెందిన మద్యం బ్రాండ్లనే మాత్రమే లిక్కర్ షాపుల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఏడాదికి సుమారు రూ.7 వేల కోట్లు లెక్కల్లో లేని మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గత నాలుగేళ్లలో రూ.28 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలకు లెక్కలు లేవన్నారని ఆక్షేపించారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్సైట్ను ఎందుకు మూసేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి డిప్యూటీ సీఎం సిసోడియా సహా చాలా మంది జైళ్లలో పెట్టారన్నారు. ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణం ఈడీ, సీబీఐకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో మద్యం దోపిడీ, నాసిరకం మద్యాన్ని అరికట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.