ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్…పసికూన నెదర్లాండ్స్‌తో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ దిశగా మరో అడుగు ముందుకే వేయాలని కివీస్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిన కాన్వే, రచిన్ రవీంద్ర మరోసారి చెలరేగాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. పాకిస్థాన్‌తో ఉప్పల్‌లోనే ఆడిన తొలి మ్యాచ్‌లో చక్కటి పోరాటంతో ఆకట్టుకున్న నెదర్లాండ్స్.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేసి కివీస్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పూర్తిగా కోలుకోపోవడంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగడం లేదు. వికెట్ కీపర్ టామ్ న్యూజిలాండ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌పై కివీస్ నాలుగు వన్డేలు అడగా నాలుగింట్లోనూ గెలుపొందింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో దుర్భేద్యంగా ఉన్న కివీస్‌ను నెదర్లాండ్స్ నిలువరించడం అంత తేలిక కాదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. విలియమ్సన్ గైర్హాజరీతో తొలి మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాన్ని రచిన్ రవీంద్ర రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. రచిన్ రవీంద్ర, కాన్వే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పైనా వీరు మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది.
నెదర్లాండ్స్ ఆశలు
నెదర్లాండ్స్ తనదైన రోజున ఎంత పెద్ద జట్టుకైన షాక్ ఇవ్వగలదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బౌలర్లు పాక్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లోనూ సమర్థంగా రాణించారు. అనుభవలేమితో పాక్‌తో జరిగిన పోరులో నెదర్లాండ్స్ పరాజయం పాలైనా వారి ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. భారత సంతతి ఆటగాళ్లు డచ్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్‌సింగ్, తేజ నిడమనూరు నెదర్లాండ్స్ బ్యాటింగ్ బారాన్ని మోస్తున్నారు. బౌలింగ్‌లోనూ నెదర్లాండ్స్ జట్టు పర్వాలేదనిపిస్తుంది. ఉప్పల్‌లో పాక్‌తో ఒక మ్యాచ్ ఆడడంతో ఈ పిచ్ ఎలా స్పందిస్తుందన్న దానిపై నెదర్లాండ్స్ జట్టుకు ఓ అంచనా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు గట్టిపోటీ ఇవ్వాలని డచ్ జట్టు పట్టుదలతో ఉంది.
విలియమ్సన్ దూరం
తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన కివీస్ సారధి కేన్ విలియమ్సన్.. రెండో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. విలియమ్సన్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడన్న గ్యారీ స్టెడ్… కానీ అతడు పూర్తిగా కోలుకోవాల్సి ఉందని తెలిపాడు. రెండో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్ దూరంగా ఉంటాడని, కానీ మూడో మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు కివీస్ హెడ్ కోచ్ తెలిపాడు. కేన్ త్వరగా కోలుకుని ఈ మెగా టోర్నీలో జట్టుతో కలవాలనే తాము కోరుకుంటున్నామని వివరించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవట్లేదన్న కివీస్ కోచ్.. పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్ జట్టు:
ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్( కెప్టెన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్
నెదర్లాండ్స్ జట్టు:
స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫిక్ , షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్