హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్‌పై దృష్టి పెడుతున్న నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ముఖ్యంగా ఈ సినిమాను హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రవితేజ నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. అయితే థియేటర్లలో కంటే యూ ట్యూబ్‌లోనే అతని సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. అందుకే హిందీ థియేటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మేకర్స్. దాదాపు అన్ని భాషల్లోనూ రవితేజ సొంతంగా డబ్బింగ్ చెప్పాడు.
ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను బాగా పెంచారు. జాతీయ మీడియాలో కూడా ఈ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. ఒక జాతీయ మీడియా సమావేశంలో రవితేజ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. రామ్‌చరణ్, విజయ్, రాజమౌళి, ప్రభాస్, యశ్‌ల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘రామ్‌చరణ్, విజయ్‌ల డ్యాన్స్ అంటే ఇష్టం. ప్రభాస్ నిజంగానే డార్లింగ్. రాజమౌళి అంటే ఒక విజన్. యశ్‌కు కేజీయఫ్ లాంటి సినిమా దొరకడం అదృష్టం. కేజీయఫ్ తప్ప ఇంకే చిత్రం కూడా చూడలేదు’ అని సమాధానమిచ్చాడు. దీంతో యశ్ ఫ్యాన్స్ రవితేజపై మండిపడుతున్నారు. ‘యశ్‌కు కెజిఎఫ్ దొరకడం లక్కీనా? నువ్వు యశ్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు కెరీర్ ప్రారంభంలో కన్నడ చిత్రంలో సైడ్ యాక్టర్‌గా నటించావు. ఇలా సైడ్ పాత్రను కన్నడ చిత్రంలో చేసేందుకు చాన్స్ రావడం నీ లక్కీ’ అంటూ రవితేజను ట్రోల్ చేస్తున్నారు.
రవితేజ ఎంతో క్యాజువల్‌గా చెప్పిన విషయాన్ని తీసుకొని యశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారని, ఇది సరికాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యశ్ కిందిస్థాయి నుంచి వచ్చాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అలాగే రవితేజ కూడా కింది స్థాయి నుంచి వచ్చి ఈ రేంజ్‌కి వచ్చాడు. అందులోనూ రవితేజ సీనియర్ హీరో. అతన్ని ఇలా ట్రోల్ చేయడం సరికాదని యశ్ ఫ్యాన్స్‌తో వాదిస్తున్నారు నెటిజన్లు.